Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీజేపీ ఎమ్మెల్యేపై పోక్సో చట్టం కింద కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

Advertiesment
Himachal BJP MLA Hans Raj

ఠాగూర్

, ఆదివారం, 9 నవంబరు 2025 (12:23 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆయన గతంలో రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్ కూడా కావడం గమనార్హం. మైనర్‌గా ఉన్నప్పుడు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, పెళ్లి పేరుతో మోసం చేశారంటూ ఓ యువతి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. 
 
అయితే, ఈ కేసు నమోదు కావడానికి ఒక రోజు ముందే, ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడితో పాటు మరో సన్నిహితుడిపై కిడ్నాపింగ్ కేసు నమోదవడం ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అలాగే, బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని ఎమ్మెల్యే హన్స్ రాజ్‌పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. చిన్నారులపై లైంగిక నేరాల నిరోధక (పోక్సో) చట్టంలోని సెక్షన్ 6 (తీవ్రమైన లైంగిక దాడి), భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 69 (పెళ్లి పేరుతో మోసగించి లైంగిక దాడి) కింద ఈ కేసు ఫైల్ చేసినట్లు చంబా అదనపు ఎస్పీ హితేష్ లఖన్ పాల్ శనివారం ధ్రువీకరించారు. 
 
అయితే, తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే హన్స్ రాజ్ తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత ఆరోపణలని, తన ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు ప్రత్యర్థులు పన్నిన కుట్ర అని ఆయన కొట్టిపారేశారు. న్యాయపరంగా ఈ కేసును ఎందుర్కొంటానని ఆయన పేర్కొన్నారు. 
 
గతంలో ఎమ్మెల్యే తనకు అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నారని, నగ్న ఫోటోలు పంపమని వేధిస్తున్నారని ఇదే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, దర్యాప్తు అనంతరం పోలీసులు ఆ కేసులో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేశారు. కానీ ఈ నెల 2న సదరు యువతి సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఎమ్మెల్యే తన కుటుంబాన్ని బెదిరిస్తున్నారని, తన తండ్రిని అధికారులు వేధిస్తున్నారని, ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే అనుచరులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించింది.
 
ఈ క్రమంలో, బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. గతేడాది ఎమ్మెల్యే హన్స్ రాజ్, ఆయన అనుచరులు తనను, తన కుమార్తెను బలవంతంగా సిమ్లాకు తీసుకెళ్లి, మొబైల్ ఫోనును లాక్కుని, బెదిరించి ఒక స్క్రిప్టెడ్ వీడియో రికార్డ్ చేయించారని ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం ఎమ్మెల్యే సహాయకులు ఇద్దరిపై కిడ్నాపింగ్, బెదిరింపుల కింద కేసు నమోదైంది. ఆ తర్వాత బాధితురాలి వాంగ్మూలంతో నేరుగా ఎమ్మెల్యేపై పోక్సో కేసు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న పెట్రోల్ పంప్ యజమాని