తన ఇద్దరు కుమార్తెలతో కలిసి పెట్రోల్ పంప్ యజమాని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆధార్ కార్డు నమోదుకు తీసుకెళుతున్నట్టు నమ్మించి ఇద్దరు కుమార్తెలను తన వెంట తీసుకెళ్లిన యజమాని ఈ దారుణానికి పాల్పడ్డాడు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని బోరిసానా గ్రామానికి చెందిన ధీరజ్ రబారీ అనే వ్యక్తికి పలుచోట్ల పెట్రోల్ పంపులు ఉన్నాయి. శుక్రవారం ఉదయం తన ఇద్దరు కుమార్తెలు జాహ్నవి, జియాలకు ఆధార్ కార్డులు చేయించాలని చెప్పి కారులో ఇంటి నుంచి బయలుదేరారు. అయితే, రాత్రి పొద్దుపోయే వరకు వారు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. పలు బృందాలుగా విడిపోయి విస్తృతంగా వెతికారు. ఈ క్రమంలో శనివారం ఉదయం నర్మదా ప్రధాన కాలువలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను గుర్తించారు. ఆ తర్వాత మధ్యాహ్నం సమయంలో ధీరజ్ మృతదేహాన్ని కూడా వెలికితీశారు. షెరీషా నర్మదా కాలువలో ఆయన కారును కూడా కనుగొన్నారు.
ఈ ఘటనకు ముందు ధీరజ్ తన తండ్రికి ఫోన్ చేసి 15 నిమిషాల్లో ఇంటికి వస్తానని చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే తన స్నేహితుడికి మొబైల్ ఫోన్ పాస్‌వర్డ్‌లతో పాటు తాను ఉన్న కాలువ లొకేషనన్‌ను మెసేజ్ రూపంలో పంపినట్లు సమాచారం.
గాంధీనగర్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం కలోల్ రిఫరల్ ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక విచారణలో రబారీ కుటుంబం ఆర్థికంగా ఎంతో బలంగా ఉందని, వారికి వడ్సర్, కలోల్తో పాటు మరో రెండు ప్రాంతాల్లో పెట్రోల్ పంపులు ఉన్నాయని తేలింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఆత్మహత్యకు కారణం కాకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ కలహాలు లేదా ఇతర వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.