కువైట్ దేశానికి వలస వెళ్లి ఉద్యోగం చేస్తున్న ఇతర దేశాలకు చెందిన వారికి ఆ దేశ ప్రభుత్వం తేరుకోలేని షాకివ్వనుంది. వలస ఉద్యోగులను క్రమంగా తొలగించాలన్న నిర్ణయానికి వచ్చింది. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వలసదారులను ఎట్టి పరిస్థతుల్లోనూ 2028 నాటికి పూర్తిగా తొలగించేయాలని భావిస్తోంది.
అదేవిధంగా ప్రైవేటు రంగంలో కనీసం 30 శాతం నుంచి 60 శాతం వరకు స్వదేశీ ఉద్యోగులే ఉండేలా జీవోను జారీచేయనుంది. వలసదారులకు ఉద్యోగాలివ్వడం వల్ల కువైట్ వాసుల భవితవ్యం దెబ్బతింటోందని, వారు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో కఠిన చర్యలకు ఉపక్రమించాలని భావిస్తోంది.
ప్రస్తుతం కువైట్ బ్యాంకింగ్ రంగంలో 66 శాతం వలసదారులే పని చేస్తున్నారని, వీరిని తొలగించి వారి స్థానాలను కువైట్ వాసులకు ఇవ్వాలని యోచిస్తోంది. దీనికోసం తీవ్రంగా శ్రమిస్తున్న ప్రభుత్వం.. ఈ యేడాది కనీసం 8 వేల మంది వలసదారులను తొలగించి వారి స్థానాలను స్వదేశీయులతో భర్తీ చేయనుంది. ప్రస్తుతం ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారిలో కువైట్ వాసులు 26వేల మంది ఉండగా, వలసదారులు 83 వేల మంది ఉండటం గమనార్హం.