కరోనా వైరస్ ఇటలీలో బీభత్సం సృష్టిస్తోంది. శుక్రవారం ఒక రోజే ఆ దేశంలో కరోనా కారణంగా 627 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో, ఆ దేశంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,032కి చేరుకుంది. ఫలితంగా కరోనా మరణాల సంఖ్యలో చైనాను ఇటలీ అధిగమించింది. ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు సంభవించిన దేశంగా నిలిచింది.
కరోనాను కట్టడి చేయడం ఇప్పుడు ఇటలీకి పెను సవాల్‌గా నిలిచింది. పరిస్థితి పూర్తిగా చేజారి పోవడంతో.. ఆ దేశ ప్రభుత్వం నిస్సహాయ స్థితిలోకి జారిపోయింది. అక్కడి ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇంకా కరోనా మృతదేహాలను ఖననం చేసేందుకు చోటు లేకుండా ఇటలీ నానా తంటాలు పడుతోంది.
ఇప్పటికే దేశంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ బెడ్స్ అన్నీ నిండిపోయాయి. యుద్ధ ప్రాతిపదికన మరో 10 వేల బెడ్స్ ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నిస్తున్నామని, మరో రెండు రోజుల్లో ఇవి అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇటలీలో కరోనా కారణంగా మరణించిన వారిలో 80 శాతం మందికి పైగా వయో వృద్ధులే ఉండటం గమనార్హం. వీరిలో వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లడమే మరణానికి కారణమని వైద్యులు తేల్చారు