భారత్‌లో ముస్లిం (మైనార్టీలు)లకు ఏమాత్రం భద్రత లేదని అయోధ్య తీర్పుతో మరోమారు నిరూపితమైందని పాకిస్థాన్ అభిప్రాయపడింది. శనివారం వెల్లడైన అయోధ్య తుది తీర్పుపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మొహ్మద్ ఖురేషీ స్పందించారు.
ఈ తీర్పుతో భారత్‌లో మైనారిటీలకు భద్రత లేదని మరోమారు రుజువైందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌ను హిందూదేశంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించింది. సంఘ్ పరివార్ తన హిందుత్వ ఎజెండాను అమలు చేసేందుకు చరిత్రను తిరగ రాస్తోందని ఆరోపించారు. అయోధ్యపై తుది తీర్పు వెలువరించేందుకు ఆ దేశ సుప్రీంకోర్టు ఎంచుకున్న సమయం సరికాదని పాక్ విదేశాంగశాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ వ్యాఖ్యానించారు.
అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పాక్ స్పందించడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. తమ అంతర్గత వ్యవహారంలో మీ జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పింది. పాక్ స్పందనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ పేర్కొన్నారు.
అయోధ్య తీర్పు పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని, ఇది చట్టానికి సంబంధించినదని ఆయన అన్నారు. అన్ని వర్గాల విశ్వాసాలను చట్టం సమానంగా గౌరవిస్తుందన్నారు. విద్వేషాలు సృష్టించడమే పాక్ లక్ష్యమని ఆరోపించారు. పాక్ వాదన పూర్తిగా అసమంజసమని కొట్టిపడేశారు.