Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికాలో పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారు.. అయితే, దేశ బహిష్కరణ వేటు

Advertiesment
Visa

ఠాగూర్

, మంగళవారం, 9 సెప్టెంబరు 2025 (10:59 IST)
అమెరికాలో ఉండే హెచ్ 1బీ, ఎఫ్1 (విద్యార్థి) వీసాదారులకు ట్రంప్ సర్కారు గట్టి హెచ్చరిక చేసింది. తమ దేశ నిబంధనలకు విరుద్ధంగా పార్ట్-టైమ్ ఉద్యోగాలు లేదా ఇతర మార్గాల ద్వారా అదనపు ఆదాయం సంపాదిస్తే మాత్రం సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. పైగా ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు దేశ బహిష్కరణకు గురికావాల్సి వస్తుందని తెలిపింది. ముఖ్యంగా, చిన్న పొరపాటు చేసినా దేశ బహిష్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని ఇమిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా ప్రభుత్వం, ఇప్పుడు చట్టబద్ధంగా దేశంలో ఉంటున్న వీసాదారుల కార్యకలాపాలపై కూడా దృష్టి సారించింది. ముఖ్యంగా ఇమిగ్రేషన్ అధికారులు రాయబార కార్యాలయాలు, విమానాశ్రయాల్లోని ఎంట్రీ పాయింట్ల వద్ద వీసాదారులను క్షుణ్ణంగా ప్రశ్నిస్తున్నారు. గతంలో విద్యార్థిగా ఉన్నప్పుడు అనధికారికంగా ఏమైనా పనులు చేశారా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. చిన్న ట్రాఫిక్ ఉల్లంఘనల నుంచి వారి పూర్తి నేపథ్యం వరకు అన్ని వివరాలను పరిశీలిస్తున్నారు.
 
ఈ నిఘాలో భాగంగా అమెరికా పన్నుల విభాగమైన ఐఆర్ఎస్ రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. వీసాదారుల ఆదాయ వివరాలు, పన్ను చెల్లింపుల్లో ఏవైనా తేడాలు ఉన్నాయా? అని ఆరా తీస్తున్నారు. ఈ ఆర్థిక సమాచారాన్ని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి అందిస్తున్నారు. అంతేకాకుండా, వీసాదారుల సోషల్ మీడియా ఖాతాలపై కూడా ఓ కన్నేసి వారి ప్రవర్తనను అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.
 
అయితే, ఈ కఠిన నిబంధనలు ఇంకా పూర్తిస్థాయిలో అమలు కానప్పటికీ, వీసాదారులు చాలా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అనధికారిక పనులు, అదనపు ఆదాయ మార్గాలకు దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు. ఏవైనా సందేహాలు ఉంటే, వెంటనే న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే దేశ బహిష్కరణ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని వారు వివరిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్కూటీపై వెళుతున్న వివాహితకు నిప్పంటించిన అకతాయి... మంటల్లో కాలుతూనే...