ఆంధ్రా కుర్రోడు అనంతపురంలో చరిత్ర సృష్టించాడు. అనంతపురం జిల్లాకు చెందిన ఈ తెలుగు విద్యార్థి ఏకంగా రూ.5 కోట్ల వార్షిక వేతనంతో టెక్కీ ఉద్యోగం దక్కించుకున్నాడు. జిల్లాలోని గుంతకల్లు పట్టణానికి చెందిన సాయిసాకేత్, ఏకంగా రూ.5 కోట్ల వార్షిక వేతనంతో అమెరికాలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ 'ఆప్టివర్'లో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. బీటెక్ చివరి సంవత్సరం చదువుతుండగానే ఇంతటి భారీ ప్యాకేజీతో కొలువు సాధించడం విశేషం.
ఉద్యోగంలో భాగంగా సాయిసాకేత్ ముందుగా పది వారాల పాటు ఇంటర్న్‌షిప్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే, ఈ ఇంటర్నిషిప్ కాలానికే సదరు సంస్థ అతనికి రూ.కోటి వేతనం చెల్లించనుంది. ఇంటర్నిషిప్ విజయవంతంగా పూర్తికాగానే, ఏడాదికి రూ.5 కోట్ల వేతనంతో పూర్తిస్థాయి ఉద్యోగంలోకి తీసుకునేందుకు ఆప్టివర్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని అతని కుటుంబ సభ్యులు సంతోషంగా వెల్లడించారు.
సాయిసాకేత్ తల్లిదండ్రులు రమేశ్, వాసవి. గుంతకల్లుకు చెందిన ఈ దంపతులు పదేళ్ల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. సాయిసాకేత్ విద్యాభ్యాసం మొత్తం అమెరికాలోనే సాగింది. చదువు పూర్తికాకముందే కొడుకు అత్యున్నత స్థాయి ఉద్యోగం సాధించడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.