అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్కిన్ భారత్‌పై నోరు పారేసుకున్నారు. అమెరికా విధించిన సుంకాల భారాన్ని భారత్ ఏమాత్రం పట్టించుకోలేదు పైగా, ఈ విషయంలో భారత్.. అమెరికాను బేఖాతర్ చేసింది. అమెరికా తెస్తున్న ఒత్తిళ్లకు భారత్ ఏమాత్రం లొంగడం లేదు. దీంతో అమెరికా అధికారులు నోటికి పని చెబుతున్నారు. భారత్ మరికొన్ని నెలల్లోనే అమెరికాకు క్షమాపణలు చెప్పి.. వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవచ్చని తాజాగా యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్కిన్ వ్యాఖ్యానించారు.
ఆయన తాజాగా మాట్లాడుతూ, "ఒకటి రెండు నెలల్లో యూఎస్‌తో చర్చల కోసం ఇండియా ముందుకు రావచ్చు. వారు అమెరికాను క్షమించమని అడిగి.. ట్రంప్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నించవచ్చు" అని పేర్కొన్నారు. భారత్ ఒకవేళ అమెరికా పక్షాన ఉండకపోతే వారు 50 శాతం సుంకాలను భరించాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారు.
'భారత్, రష్యాలను చైనాకు కోల్పోయినట్లు కనిపిస్తోంది. ఆ మూడు దేశాలకు ఉజ్వల, సుసంపన్నమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా' అని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో వ్యంగ్యంగా పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా లుట్కిన్ సైతం అటువంటి వ్యాఖ్యలే చేశారు.
"కొన్నిసార్లు అతిపెద్ద క్లయింట్‌తో పోరాటం చేయడం తాత్కాలికంగా గొప్పగా అనిపిస్తుంది. అయితే అది ఎల్లప్పుడూ కొనసాగదు. అంతిమంగా అమెరికాతో ఒప్పందం చేసుకోవడానికి వ్యాపారాలు డిమాండ్ చేస్తాయి. భారత్ తన మార్కెట్ తలుపులను మూసేయడం, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం, బ్రిక్స్‌లో భాగస్వామిగా కొనసాగడం ఆపాలనుకోవడం లేదు.
రష్యా, చైనా మధ్య భారత్ వారధిగా ఉండాలనుకుంటే అలానే ఉండండి. అయితే అమెరికా డాలర్‌కు గానీ, యూఎస్‌కు గానీ లేదా అతిపెద్ద వాణిజ్య భాగస్వామికి మద్దతు తెలపాల్సిందే. లేకుంటే 50 శాతం టారీఫ్లను భరించాల్సి వస్తుంది. భారత వైఖరి ఎన్నాళ్ల పాటు ఇలాగే కొనసాగుతుందో చూద్దాం" అంటూ పరోక్షంగా హెచ్చరించారు.