బంగ్లాదేశ్‌లో నదిలో పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో పడవలో ప్రయాణీస్తున్న 28 మంది ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్ బురిగంగా నదిలో మార్నింగ్ బర్డ్ అనే పడవ.. మున్షిగంజ్ నుంచి సదర్ ఘాట్ వైపు వెళ్తున్న సమయంలో మౌయురి-2 అనే నౌకను ఢీకొట్టింది. దీంతో పడవ నీటిలో మునిగింది. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం 50 మంది ఉన్నారు.
అయితే మృతుల్లో ముగ్గురు పిల్లలు, ఆరుగురు మహిళలు ఉన్నారు. కొందరు ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, డైవర్లు సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను వెలికితీసే పనుల్లో నిమగ్నమయ్యారు. డజన్ల సంఖ్యలో పడవలో ప్రయాణించిన వారు గల్లంతు అయ్యారు. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.