Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం జగన్ నాకు దేవుడు.. ఆ విషయం లీక్ చేస్తే మళ్లీ వివాదమే : డాక్టర్ సుధాకర్

Advertiesment
సీఎం జగన్ నాకు దేవుడు.. ఆ విషయం లీక్ చేస్తే మళ్లీ వివాదమే : డాక్టర్ సుధాకర్
, గురువారం, 11 జూన్ 2020 (15:33 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై డాక్టర్ సుధాకర్ ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం జగన్ గారు తనకు దేవుడు అని చెప్పారు. పైగా, తాను ఏ ఒక్క పార్టీకి చెందిన వ్యక్తిని కాదని ఆయన చెప్పుకొచ్చారు. 
 
విశాఖపట్టణం నాలుగవ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న తన కారును తీసుకునేందుకు డాక్టర్ సుధాకర్ వచ్చారు. ఈ  సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈమేరకు స్పందించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ చీఫ్ చంద్రబాబు, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అందరూ బాగానే పాలించారన్నారు. ప్రభుత్వాన్ని తిట్టాల్సిన అవసరం తనకు లేదన్నారు. 
 
'సీఎం జగన్ గారు నాకు దేవుడు, పేదల కోసం జగన్ మంచి పనులే చేస్తున్నారు... ఆయనను తిట్టాల్సిన అవసరం నాకు లేదు' అన్నారు. మోడీని కూడా తాను విమర్శించలేదని గుర్తుచేశారు. అయినా, వాళ్లను తిట్టేంత ధైర్యం తనకు లేదన్నారు. ఒక పక్కా ప్లాన్ ప్రకారమే తనపై దాడి జరిగిందని గుర్తుచేశారు.  
 
తాను సస్పెండ్ అయినప్పటి నుంచి తనకు దారుణమైన ఫోన్ కాల్స్ వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా తాను భయపడ్డానని చెప్పారు. బ్యాంక్ పని కోసం తప్పనిసరిగా నక్కపల్లి వెళ్లాల్సి వచ్చిందని... తాను వెళ్తుండగా తనను కొందరు ఫాలో అవుతుండటంతో కారును ఆపానని తెలిపారు. 
 
కారులో కొంచెం డబ్బు ఉందని... కారును దిగిన తర్వాత తనపై దాడి జరిగిందని... పోలీసులకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పారు. తప్పుడు పనులు చేస్తున్నట్టు పోలీసులకు తనపై ఫిర్యాదు చేశారని అన్నారు. తనపై పిచ్చోడి ముద్ర వేసి, ఉద్యోగాన్ని తీయించాలనే కుట్ర చేశారని సుధాకర్ చెప్పారు. 
 
టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఇంటికి వెళ్లడమే తాను చేసిన తప్పు అని... ఎవరికో చెడ్డ పేరు తెచ్చేందుకు తనను వాడుకున్నారని అన్నారు. తనకు గుండు గీసిందెవరో చెపితే మళ్లీ గొడవ అవుతుందని చెప్పారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు చంపేస్తామని బెదిరిస్తే... మా ఇంట్లో వాళ్లంతా భయపడిపోయారని డాక్టర్ సుధాకర్ చెప్పుకొచ్చారు.
 
ముఖ్యంగా, రాజకీయ అవసరాల కోసం తనను ఎవరూ ఉపయోగించుకోలేదని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ తన ఉద్యోగం తనకు ఇప్పించాలని కోరుతున్నానని అన్నారు. తనకు రాజకీయాలంటేనే అసహ్యమని... ఉద్యోగమే తనకు ముఖ్యమని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రన్న కానుకపై ఆరా : సీబీఐ విచారణకు ఏపీ సర్కారు నిర్ణయం!!