డిస్నీ క్రూయిజ్ నౌకలో ఊహించని సంఘటన ఒకటి జరిగింది. నౌకలోని నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు ఓ చిన్నారి సముద్రంలో పడిపోయింది. దీంతో కన్నతండ్రి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. కన్నబిడ్డను కాపాడుకోవాలన్న తాపత్రయంతో ఒక్కసారిగా నాలుగో అంతస్తు నుంచి సముద్రంలోకి దూకేశాడు. ఆయన సాహసంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడగా, ఇపుడు తండ్రి మాత్రం రియల్ హీరోగా ప్రశంసలు అందుకుంటున్నారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జూన్ 29వ తేదీన బహామాస్ నుంచి ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్‌డేల్‌కు తిరిగి వస్తున్న డిస్నీ డ్రీమ్ నౌకలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుమార్తె నీళ్ళలో పడగానే ఆమె తండ్రి కూడా వెనుకనే దూకేశాడు.
దాదాపు 20 నిమిషాల పాటు ఆయన తన కుమార్తెను నీటిపై తేలి ఉండేలా పట్టుకుని కాపాడారు. ఇంతలో నౌక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి నిమిషాల వ్యవధిలో తండ్రీకుమార్తెలను ప్రాణాలతో రక్షించారు.
మా సిబ్బంది అద్భుతమైన నైపుణ్యంతో వేగంగా స్పందించి వారిద్దరినీ సురక్షితంగా రక్షించారు. మా ప్రయాణికుల భద్రతే మాకు ముఖ్యం అని డిస్నీ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన తోటి ప్రయాణికులు మాత్రం ఆ తండ్రిని రియల్ హీరోగా కొనియాడుతున్నారు.
"ఆయన నిజమైన హీరో. తన బిడ్డను కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించాడు" అంటూ కితాబిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాగే, తండ్రీ కుమార్తెలిద్దరూ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.