అమెరికా నౌకా దళానికి చెందిన రూ.476 కోట్ల విలువైన యుద్ధ విమానం ఒకటి నీటిపాలైంది. యూఎస్ఎస్ హ్యారీ ఎస్ ట్రూమన్ విమానవాహక నౌక పైనుంచి ఈ విమానం ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయింది. ఈ నెల 28 తేదీ ఆదివారం ఎర్ర సముద్రంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్ట్రైక్ స్క్వాడ్రన్ 136కు చెందిన సుమారు 56 మిలియన్ డాలర్ల భారతీయ కరెన్సీలో రూ.476 కోట్ల విలువైన ఎఫ్/ఏ-18ఈ సూపర్ హార్నెట్ రకం యుద్ధ విమానాన్ని నౌకలోని హ్యాంగర్ బేలో టోయింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
యెమెన్‌లోని హౌతీ రెబల్స్ నిర్వహించిన క్షిపణి, డ్రోన్ల దాడి నుంచి తప్పించుకునేందుకు నౌక ఆకస్మికంగా గట్టి ములుపుతీసుకుందని, ఆ సమయంలో విమానాన్ని లాగుతున్న సిబ్బంది దానిపై నియంత్రణ కోల్పోయారని అధికారులు చెబుతున్నారు. దీంతో ఫైటర్ జెట్, దానిని లాగుతున్న టో ట్రాక్టర్‌తో సహా సముద్రంలో జారిపోయినట్టు యూఎస్ నేవీ ఓ పత్రికా ప్రకటనలో ధృవీకరించింది.
విమానాన్ని హ్యాంగర్ బే టో చేస్తుండగా సిబ్బంది నియంత్రణ కోల్పోయారు. విమానం, టో ట్రాక్టర్ సముద్రంలో పడిపోయాయి. విమానం పడే ముందు సిబ్బంది అప్రమత్తమై పక్కకు తప్పుకున్నారు. సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారు. ఒక నావికుడుకి మాత్రం స్వల్ప గాయమైంది అని నేవీ ఓ ప్రకటనలో పేర్కొంది.