Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీ : బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ భద్రత!

Advertiesment
వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీ : బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ భద్రత!
, మంగళవారం, 12 జనవరి 2021 (15:11 IST)
మరికొన్ని రోజుల్లో అధ్యక్ష పీఠం నుంచి ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దిగిపోనున్నారు. అయితే, ఆయన దిగిపోయేందుకు ముందు కొన్ని మంచి పనులు కూడా చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన కొత్త అధ్యక్షుడుగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు జరుగరాదని భావించి వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీని విధించారు. 
 
ఈ నెల20వ తేదీన బెడెన్ అమెరికా 46వ అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బైడెన్ ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా రెండు వారాల పాటు ఎమర్జెన్సీ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం వైట్‌హౌస్ ఎమర్జెన్సీ ప్రకటన విడుదల చేసింది. 
 
గత బుధవారం వాషింగ్టన్ కేపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కావడంతో పాటు నలుగురు మరణించారు. ఈ ఘటన నేపథ్యంలో బైడెన్‌ ప్రమాణ స్వీకారం సమయంలో ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా చర్యగా ట్రంప్‌ వాషింగ్టన్‌లో అత్యవసర పరిస్థితిని విధించారని వైట్‌హౌస్‌ వెల్లడించింది. 
 
ఈ ఎమర్జెన్సీ జనవరి 11 నుంచి 24 వరకు ఉంటుందని ప్రకటించింది. మరోవైపు రాజధాని వాషింగ్టన్‌తో పాటు దేశంలోని 50 రాష్ట్రాల రాజధానుల్లోని కేపిటళ్లపై దాడికి కుట్రలు జరుగుతున్నట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) హెచ్చరించింది. బైడెన్ ప్రమాణ స్వీకారానికి సమయంలోదగ్గర పడుతున్న కొద్దీ ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని ఎఫ్‌బీఐ హెచ్చరించడంతో భద్రతను కట్టుదిట్టం చేసే దిశగా రాజధానిలో ఎమర్జెన్సీ విధించారు. 
 
"ఇవాళ అధ్యక్షుడు ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. 59వ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 11 నుంచి 24 వరకు అత్యవసర పరిస్థితిని విధించారు. గత వారం ట్రంప్‌ మద్దతుదారులు కేపిటల్ భవనంపై దాడి చేయడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ఫెడరల్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది." అని వైట్‌హౌస్ తన ప్రకటనలో పేర్కొంది. 
 
ఇక ఎమర్జెన్సీ కారణంగా స్థానికులకు తలెత్తే సమస్యలను పరిష్కారానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ, ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఫెమా)లను రంగంలోకి దింపుతున్నట్లు వైట్‌హౌస్ తెలిపింది. బుధవారం నాటి హింసాత్మక సంఘటనతో కేపిటల్ భవనంలో భద్రతా బలగాలు ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశాయి. 
 
జాతీయ స్థాయి ప్రత్యేక ప్రాముఖ్యత గల (ఎన్‌ఎస్‌ఎస్‌ఈ) 59వ అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని.. జాతీయ నిఘా సంస్థ సీక్రెట్‌ సర్వీస్‌తో సహా డజన్ల కొద్దీ భద్రతా సంస్థలు కంటి మీద రెప్ప వేయకుండా పహారా కాస్తాయి. ప్రమాణస్వీకారం కార్యక్రమానికి పది లక్షల మంది హాజరైనా వారిని అదుపులో ఉంచగల మిలిటరీ, పోలీసు బలగాలు ఈ సందర్భంగా విధుల్లో ఉంటారు. 
 
కాగా, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 20న ఆయ‌న క్యాపిటల్‌ భవనంలోని వెస్ట్‌ ఫ్రంట్‌లో‌ ప్రమాణ స్వీకారం చేయ‌నున్నారు. అదేస‌మ‌యంలో ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్ర‌మాణ స్వీకారం చేస్తారు. ప్ర‌స్తుతం అమెరికాలో క‌రోనా విజృంభ‌ణ విప‌రీతంగా ఉన్న నేప‌థ్యంలో ఈ కార్యక్రమాన్ని అన్ని జాగ్ర‌త్త‌ల మ‌ధ్య నిర్వ‌హించ‌నున్నారు.
 
ఈ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి తాను హాజరు కాబోనని ట్రంప్ స్ప‌ష్టం చేశారు. అయితే, ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్ మాత్రం హాజ‌రుకానున్నారు. అలాగే, మాజీ అధ్యక్షులు జార్జ్‌ బుష్‌, బిల్‌ క్లింటన్‌ వంటి ప్రముఖులు కూడా హాజ‌రుకానున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డోనాల్డ్ ట్రంప్‌కు ట్విట్టర్ షాక్ : 70 వేల ఖాతాలు బ్లాక్!