ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు భారీ ఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. పాశ్చాత్య దేశాలలో ఈ వేడుకలను వారంరోజుల పాటు జరుపుకుంటారు. అమెరికా వంటి దేశాలలో క్రిస్మస్ సెలవులు ప్రకటిస్తారు.
అయితే అమెరికాలోని కొలరాడో నగరంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఓ వింతైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ముసలాయన కొలరాడో నగరంలో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్న సమయంలో కారులో వెళ్తూ..హ్యాపీ క్రిస్మస్ అంటూ డబ్బును గాల్లోకి విసిరాడు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ట్రాఫిక్ జామ్ గురించి సమాచారం అందుకున్న పోలీసులు అందుకు గల కారణాలను ఆరా తీయగా.. డబ్బులు రోడ్డుపైకి వెదజల్లిన వ్యక్తిని పోలీసులు పట్టుకొని డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అని ప్రశ్నించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈస్ట్ పైక్స్ పీక్ అవెన్యూలోని అకాడమీ బ్యాంకులో గతవారం దోపిడీ జరిగింది. భారీ ఎత్తున నగదు అపహరించబడింది.
ఆ దొంగతనం ఎవరు చేశారో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో క్రిస్మస్ రోజున డబ్బులు వెదజల్లిన వ్యక్తే ఆ దొంగ అని తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. చివరకు పోలీసులు ఆ దొంగను పట్టుకుని జైలుకు పంపారు.