అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు గట్టి షాక్ తగిలింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆయన్ను అభిశంసించనున్నారు. ఈ మేరకు హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ నిర్ణయించింది. ఈ అభిశంసన ఆధారంగా ట్రంప్ అధ్యక్ష పదవిలో కొనసాగుతారో లేదో తెలియాల్సివుంది.
అధికార దుర్వినియోగంతో పాటు ఉభయసభలను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆరోపణలపై ఓటింగ్ నిర్వహించారు. ఆ రెండు ఆరోపణలకు హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం తెలిపింది. ఓటింగ్‌లో డెమోక్రాట్లు ట్రంప్‌పై అభిశంసన చేయాలని ఓటేశారు. రిపబ్లికన్లు అభిశంసన ఆమోదానికి వ్యతిరేకంగా ఓటేశారు. సభలో ఓటింగ్ జరుగుతున్న సమయంలో ట్రంప్ మిచిగన్‌లో ఓ ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు.
సేనేట్ నిర్వహించే దర్యాప్తులో ట్రంప్ నిర్దోషిగా తేలుతారని వైట్‌హౌజ్ ఓ ప్రకటనలో పేర్కొంది. అభిశంసన ఎదుర్కొననున్న మూడో అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ చరిత్రలో నిలిచిపోనున్నారు. సభలో ఆరు గంటల పాటు చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. అధికార దుర్వినియోగం పాల్పడిన ఆరోపణలపై అభిశంసన ఆమోదానికి అనుకూలంగా 230, వ్యతిరేకంగా 197 ఓట్లు పోలయ్యాయి.
రెండో అభియోగంపై అభిశంసనకు అనుకూలంగా 229, వ్యతిరేకంగా 198 ఓట్లు పోలయ్యాయి. వచ్చే ఏడాది ఆరంభంలో సేనేట్‌లో ట్రంప్ విచారణ ఉంటుంది. 45వ దేశాధ్యక్షుడిగా ట్రంప్ కొనసాగాలా లేదా అన్న విషయాన్ని విచారణ ద్వారా తేలుస్తారు. మరోసారి అధ్యక్ష పోటీలో నిలవాలనుకున్న ట్రంప్‌కు ఈ అభిశంసన శరాఘాతంగా మారనున్నది.
తన ప్రత్యర్థి జోసెఫ్ బైడెన్‌ను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ట్రంప్ వత్తిళ్లు తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలుస్తోంది. గతంలో ఆండ్రూ జాన్సన్, బిల్ క్లింటన్ మాత్రమే సేనేట్‌లో అభిశంసన ఎదుర్కొన్నారు.