ఓ యువతిని ఓ యువకుడు నమ్మించి నట్టేట ముంచాడు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానంటూ ముద్దూ ముచ్చట తీర్చుకున్నాడు. అలా ఒక యేడాది పాటు చేతిలో చేయివేసుకుని తిరిగారు. ఆ తర్వాత పత్తాలేకుండా ప్రియుడు పారిపోయాడు. దీంతో ఆగ్రహించిన ప్రియురాలు.. అతనికి తగిన శాస్తి చేయాలని నిర్ణయించింది. ఏకంగా వెయ్యి కేజీల ఉల్లిపాయలను డోర్ డెలివరీ చేయించి ప్రతీకారం తీర్చుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ ఆసక్తికర కథనం వివరాలను పరిశీలిస్తే, చైనాలోని జిబో ప్రాంతానికి చెందిన ఓ యువకుడు జావో అనే యువతిని ప్రేమించాడు. ఒక యేడాది పాటు వారిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ, ఒక యేడాది తర్వాత జావోకు బ్రేకప్ చెప్పేశాడు. దీంతో ఆమె గుండె పగిలినంతపనైంది.
మూడు రోజుల పాటు వెక్కివెక్కి ఏడ్చింది. తనకు బ్రేకప్ చెప్పిన తర్వాత ఏ మాత్రమూ బాధపడకుండా ఉన్నాడని ఆగ్రహంతో రగిలిపోయింది. అతన్ని ఏడిపించాలన్న ఆలోచనతో ఏకంగా 1000 కిలోల ఉల్లిపాయలను అతనింటికి డోర్ డెలివరీ చేయించింది.
అతన్ని కలవకుండా, అతనికి తెలియకుండా, ఉల్లిపాయల మొత్తాన్ని ఇంటి వద్ద వేసి రావాలని డెలివరీ సంస్థకు చెప్పింది. 'నేను మూడు రోజుల పాటు ఏడ్చాను. ఇక నీ వంతు' అంటూ ఓ మెసేజ్‌ని కూడా పంపింది.
ఇక తన ఇంటి ముందున్న ఉల్లిపాయలను ఏం చేయాలో తెలియక సదరు యువకుడు బిత్తరపోయి చూస్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. జరిగిన ఘటనపై స్పందిస్తూ, ఆమెకు పొగరు ఎక్కువని, నాటకాలు ఆడుతోందని మండిపడ్డాడు. బ్రేకప్ చెప్పిన తర్వాత తాను కూడా బాధపడ్డానని వాపోతున్నాడు.