బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి జరుగుతున్న ఎన్నికల్లో భారత మూలాలు ఉన్న రిషి సునక్ రేసులో వెనుకబడి ఇపుడు మళ్లీ పుంజుకుంటున్నారు. అదేసమయంలో పార్టీ గేట్ స్కామ్‌లో విచారణ ప్రభుత్వ ప్రక్రియ కాదని తాను ప్రధాని అయితే, స్వతంత్ర సలహాదారుడిని నియమిస్తానని రిషి సునక్ తెలిపారు. మరోవైపు, మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తాను పంపే సందేశాలకు, చేసే ఫోన్లకు స్పందించడం లేదని చెప్పారు.
బ్రిటన్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఇంగ్లండ్‌లోని చెల్టెన్‌హామ్‌లో తాజాగా టోరీ సభ్యులతో చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. బోరిస్ జాన్సన్ పార్టీ గేట్ కుంభకోణంపై జరుగుతున్న పార్లమెంటరీ విచారణపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఇది పూర్తిగా పార్లమెంటరీ ప్రక్రియ అని, ప్రభుత్వ ప్రక్రియ కానే కాదని స్పష్టం చేశారు. కామన్స్ ప్రివిలెజెస్ కమిటీలోని ఎంపీలను తాను గౌరవిస్తానన్నారు. వారు సరైన నిర్ణయాలు తీసుకుంటారని రిషి చెప్పుకొచ్చారు.
వ్యక్తిగతంగా ఉన్నత ప్రమాణాలు పాటించే తాను ప్రధాని అయిన వెంటనే మంత్రివర్గ ప్రయోజనాల కోసం స్వతంత్ర సలహాదారుడిని నియమిస్తానన్నారు. విశ్వాసం, చిత్తశుద్ధి, మర్యాద వంటివి రాజకీయ ఆత్మకు సంబంధించిన అంశాలని పేర్కొన్నారు. కాగా, రిషి సునాక్‌కు పోటీగా లిజ్ ట్రస్ బరిలో ఉన్నారు.