ప్రపంచలో కరోనా వైరస్ వెలుగు చూసిన తర్వాత అనేక రకాలైన కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఈ వేరియంట్ వైరస్‌లు సోకిన వారిలో పలువురు మృత్యువాతపడుతున్నారు. దీంతో ప్రజలు భయపడిపోతున్నారు. తాజాగా ఆఫ్రికా దేశాల్లో వైద్యులకే అంతు చిక్కని విధంగా, కరోనాను మించిన కొత్త వైరస్ ఒకటి వెలుగు చూసింది. గత 24 గంటల్లో ఈ వైరస్ సోకిన వారిలో ముగ్గురు ప్రాణాలు కూడా కోల్పోయారు.
ఈ వైరస్ బారినపడినవారికి జ్వరం, వాంతులు, తలనొప్పి వంటి లక్షణాలు ఉన్నట్టు స్థానిక వైద్యులు వెల్లడించారు. ఇదేసమయంలో ఈ వైరస్ సోకిన వారికి ముక్కు నుంచి రక్తస్రావం జరుగుతుందని తెలిపారు. నిజంగానే ఇది ఆందోళన కలిగించే విషయమని వారు తెలిపారు. కొత్త వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆఫ్రికా దేశాల్లో ఒకటైన బురుండి దేశ ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
దీంతో రంగంలోకి దిగిన అధికారులు బజిరో పట్టణాన్ని క్వారంటైన్ చేశారు. ఇదిలావంటే, కొత్త వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా బురిండి సమీప దేశాలకు హెచ్చరికలు చేసింది. కొత్త వైరస్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. కాగా, ఇటీవల బురిండి పక్కదేశమైన టాంజానియాలో మార్‌బర్గ్ అనే కొత్త వైరస్ వెలుగు చూసిన విషయం తెల్సిందే. దీంతో ఇదే వైరస్ బురిండిలో కూడా వ్యాపించిందా అనే సందేహం కలుగుతుంది.