ఆప్ఘనిస్థాన్‌లోని ఓ ప్రావీన్స్ అయిన షంజ్‌పీర్ లోయను కూడా తాలిబన్ తీవ్రవాదులు స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు. దీంతో షంజ్‌పీర్‌లో తమ జెండాను ఎగురవేసినట్టు వెల్లడించారు. ఈ మొత్తం ప్రాంతమంతా వాళ్ల ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం అధికారికంగా తాలిబన్లు ఈ విషయాన్ని ప్రకటించుకున్నారు.
ఆప్ఘనిస్థాన్‌లో చిట్టచివరి ప్రాంతాన్ని కైవసం చేసుకోవడంలో తాలిబన్లు సఫలమైనట్లు తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపాడు. మరోపక్క పంజ్‌షీర్ ప్రావిన్సియల్ గవర్నర్ కార్యాలయంపై తాలిబన్లు జెండా ఎగరవేస్తున్న దృశ్యాలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ దాడులకు సంబంధించిన పూర్తి స్థాయి నష్టం వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే తాలిబన్లను భారీ సంఖ్యలో మట్టుపెట్టామని పంజ్‌షీర్ యోధులు ప్రకటించిన రోజు వ్యవధిలోనే.. ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోవడం విశేషం.
మరోవైపు పంజ్‌షీర్ సాయుధ దళాల నేత అహ్మద్ మసూద్ పోరాటం పక్కనపెట్టి, చర్చల కోసం హస్తం చాస్తున్నట్లు ఆదివారం సాయంత్రం ప్రకటించాడు. అయితే ఆయుధం పక్కనపెట్టే ప్రసక్తే లేదని తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల తాజా పంజ్‌షీర్ కైవసం ప్రకటన కథనాలపై స్పందించేందుకు అహ్మద్ అందుబాటులో లేకుండా పోయాడు.