99 ఏళ్ల వయస్సులో స్కూల్‌లో చదువుకోవడానికి వెళుతున్న బామ్మ..

సోమవారం, 15 ఏప్రియల్ 2019 (14:31 IST)
సాధారణంగా మనదేశంలో 60 ఏళ్ళ పైబడిన వ్యక్తుల్లో చాలా మంది హాయిగా ఇంట్లో కృష్ణా రామా అంటూ జీవితాన్ని గడిపేస్తారు. అలాంటిది 99 ఏళ్ళ వయసు ఉన్న ఒక బామ్మ స్కూల్‌కి వెళ్లి చదువుకుంటోంది. అదేంటి ఆ వయస్సులో స్కూల్‌కి వెళ్లడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? అర్జెంటీనాకు చెందిన ఆ బామ్మ హుషారుగా స్కూల్‌కి వెళ్లి చదువుకుంటోంది. అసలు ఈ బామ్మ ఎందుకు 99 ఏళ్ల వయసులో స్కూల్‌కు వెళ్తోందో మీరు కూడా ఓ సారి చూడండి..
 
అర్జెంటీనాకు చెందిన ఆ బామ్మ పేరు యుసెబియా లియోనర్ కోర్డల్. ఆమెకు చిన్నతనంలోనే అమ్మ చనిపోయింది. పైగా అప్పట్లో ఇంట్లో చాలా సమస్యలు ఉన్న కారణంగా కోర్డల్ బామ్మ చదువులకు ఫుల్ స్టాప్ పెట్టిందట. అయితే ఇప్పుడు ఆ సమస్యలు అన్నీ తీరిపోయాయని, అందుకే మళ్లీ స్కూల్‌కి వెళ్తున్నట్లు కోర్డల్ బామ్మ సెలవిచ్చింది.
 
బామ్మ ప్రస్తుతం లఫ్రిడాలో ఉన్న ప్రైమరీ స్కూల్‌కు వెళ్తోంది. ఇక ఆ స్కూల్ కూడా ఇలాంటి చిన్నప్పుడు చదువుకోలేకపోయినవాళ్లు పెద్దయ్యాక చదువుకోవడం కోసం ఏర్పాటు చేసినదేనట. కోర్డల్ బామ్మ తన 98వ ఏట స్కూల్‌కి వెళ్లడం ప్రారంభించిందట. 
 
అప్పటి నుండి ఒక్కరోజు కూడా స్కూల్‌కు డుమ్మా కొట్టలేదట. ఆ పాఠశాలలో పని చేసే టీచర్లే ఇంటి దగ్గరి నుండి తీసుకెళ్లి, మళ్లీ సాయంత్రం ఇంటి దగ్గర వదిలిపెడతారట. చదువు పట్ల ఆసక్తి, అలాగే నేర్చుకోవాలనే తపన ఉన్న ఈ వండర్‌ఫుల్ బామ్మకు నిజంగా హేట్సాఫ్ చెప్పాల్సిందే..

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం గెలుపు తథ్యం... 110 నుంచి 140 సీట్లు మావే... : చంద్రబాబు