నైజీరియా దేశంలో మరోమారు పెను విషాదం సంభవించింది. పడవ బోల్తా పడిన 76 మంది జల సమాధి అయ్యారు. ప్రమాదంలో జరిగిన సమయంలో బోటులో 85 మంది వరకు ఉండగా, వీరిలో 76 మంది ప్రాణాలు కోల్పోయారు. నదిలో నీటి ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో పడవ నియంత్రణ కోల్పోయి బోల్తాపడింది. గత కొన్ని నెలలుగా నైజీరియా దేశంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ప్రమాదంలో 76 మంది చనిపోయారని నైజీరియా అధ్యక్షుడు మహ్మద్ బుహారీ తెలిపారు.
సమాచారం తెలుసుకున్న ఆయన తక్షణం సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో నదిలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ ప్రమాదం నైజీరియా దేశంలోని అనంబ్రాలో జరిగింది. 85 మంది ప్రయాణికులతో వెళుతుండగా, నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో పడవ బోల్తా పడింది. రాష్ట్రంలోని ఒగబరు ప్రాంతంలో 85 మందితో వెళుతున్న పడవ ఒకటి నదిలో మునిగిపోయిందని, ఈ ప్రమాదంలో 76 మంది మృతి చెందారని అధ్యక్షుడు మహ్మద్ బుహారీ కార్యాలయం అధికారింగా వెల్లడించింది.
కాగా, ఈ దేశంలో ఈ తరహా ప్రమాదాలు జరగడం సర్వసాధారణంగా మారాయి. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, వేగం, పేలవమైన నిర్వహణ వంటి చర్యల కారణంగా ప్రజలు ప్రాణాలు తీస్తున్నాయి. ఇక్కడ వర్షకాలం ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు దాదాపు 300 మంది వరకు ఈ తరహా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.