మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎంబీబీఎస్ కోర్సును హిందీలో అందించేందుకు ముందుకు వచ్చాయి. ఇందుకోసం పాఠ్యపుస్తకాలను కూడా హిందీలో ముద్రించారు. ఈ నెల 16వ తేదీన ఈ పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. గత యేడాది నుంచి బీటెక్ కోర్సును కూడా ప్రాంతీయ భాషల్లో పలు కాలేజీలు బోధిస్తున్నాయి.
ఇప్పటికే హిందీ భాషలో ఎంబీబీఎస్ పాఠ్యపుస్తకాలను ముద్రించగా, వీటిని ఈ నెల 16వ తేదీన భోపాల్‌లో జరిగే ఓ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆవిష్కరిస్తారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ రెండు కాలేజీల్లో 15 శాతం సీట్లను జాతీయ కోటా కింద కేటాయించాల్సివుంది. ఈ సీట్లు హిందీయేతర రాష్ట్రాలకు మాత్రం సీట్లు వస్తే ఇబ్బంది తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, గత యేడాది బీటెక్ కోర్సును ఆయా ప్రాంతీయ భాషల్లో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ కాలేజీతో పాటు మొత్తం 14 కాలేజీలు ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్‌ను ప్రాంతీయ భాషల్లో బోధించేందుకు ముందుకొచ్చారు. ఈ సారి ఆ సంఖ్య 20కి చేరే అవకాశం ఉంది.