అంఫాన్ తుఫాన్ బెంగాల్‌లో బీభత్సం సృష్టిస్తోంది. బెంగాల్ తీరాన్ని తాకిన అంఫాన్ తుఫాన్ కారణంగా ఇప్పటి వరకు 12 మంది చనిపోయారు. బలమైన ఈదురుగాలులు, వర్షాలకు.. వేలాది ఇండ్లు ధ్వంసం అయ్యాయి.
కరోనా వైరస్ ఆంక్షల నేపథ్యంలో.. సహాయక చర్యలు అంతంతగానే సాగుతున్నాయి. బెంగాల్ తీరం వద్ద సుమారు గంటలకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అతి తీవ్ర తుఫాన్‌గా మారిన అంఫాన్.. రానున్న మూడు గంటల్లో అల్పపీడనంగా మారనున్నట్లు ఐఎండీ అధికారి తెలిపారు.
బెంగాల్ నుంచి ఈశాన్య దిశగా బంగ్లాదేశ్ వైపు తుఫాన్ ప్రయాణిస్తున్నది. సుమారు గంటలకు 30 కిలోమీటర్ల వేగంతో అంఫాన్ ప్రయాణిస్తున్నట్లు ఐఎండీ చెప్పింది. కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కరోనా వైరస్ కన్నా అంఫాన్ తుఫాన్ ప్రభావమే ఎక్కువగా ఉన్నట్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. అంఫాన్ నష్టం సుమారు లక్ష కోట్ల వరకు ఉంటుందని ఆమె అంచనా వేశారు. దాదాపు అయిదు లక్షల మందిని షెల్టర్ హోమ్‌లకు తరలించారు.