Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికా చేతికి ‘వూహాన్‌’ రహస్యాలు?

Advertiesment
అమెరికా చేతికి ‘వూహాన్‌’ రహస్యాలు?
, సోమవారం, 21 జూన్ 2021 (05:20 IST)
చైనా గూఢచర్య యంత్రాంగానికి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఆ దేశ హోంశాఖ ఉపమంత్రి హోదాలో 2018 సంవత్సరం నుంచి చైనా కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవహారాలకు సారథ్యం వహిస్తున్న సీనియర్‌ కమ్యూనిస్టు నాయకుడు డాంగ్‌ జింగ్‌వీ అమెరికాకు పరారైనట్లు సమాచారం.

ఆయన అదృశ్యంపై ఆందోళనతో ఉన్న చైనా.. ఆ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించడం లేదు. పైగా డాంగ్‌ చైనాలోనే ఉన్నారని, ఈనెల 18న జరిగిన ఒక సింపోజియంలో పాల్గొని ప్రసంగించారని పేర్కొంటూ అధికారిక మీడియాలో కథనాలను వండి వార్చుతోంది. ‘‘చైనా వేగుల్లో కొందరు ప్రత్యర్థి శక్తులతో చేతులు కలుపుతున్నారు.

నమ్మక ద్రోహుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.. ఖబడ్దార్‌’’ అంటూ సింపోజియం వేదికగా హోంశాఖ ఉపమంత్రి డాంగ్‌ హెచ్చరికలు జారీచేశారంటూ ఆ కథనాల్లో ప్రస్తావించింది. ఒకవేళ ఆయన అమెరికాకు పరారైన విషయమే నిజమైతే చైనా గూఢచర్య కార్యకలాపాలకు పెను విఘాతం కలుగుతుందంటూ ‘రెడ్‌ స్టేట్‌’ అనే అమెరికా పత్రిక కథనాన్ని ప్రచురించింది.
 
అదే జరిగి ఉంటే.. బైడెన్‌ ప్రభుత్వ యంత్రాంగానికి డాంగ్‌ కీలక సమాచారాన్ని అందించే అవకాశాలు ఉంటాయని పేర్కొంది. ఈ జాబితాలో వూహాన్‌ ల్యాబ్‌లో జీవాయుధాల తయారీకి చైనా సైన్యం కసరత్తు, అక్కడి ప్రయోగాల రహస్య సమాచారం, ల్యాబ్‌ నుంచి వైరస్‌ లీకేజీ, అమెరికాలో ఉన్న చైనా వేగుల సమాచారం ఉండొచ్చని అంచనా వేసింది.

మరికొన్ని అమెరికా పత్రికలు కూడా డాంగ్‌ చైనా నుంచి పరారయ్యారని, ప్రస్తుతం ఆయన అమెరికా డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (డీఐఏ) అదుపులో ఉన్నారంటూ కథనాలను ప్రచురించాయి. అయితే అమెరికా నిఘావర్గాలు, విదేశాంగ వ్యవహారాలపై కీలక సమాచారాన్ని అందించే ‘స్పై టాక్‌’ వెబ్‌సైట్‌.. డాంగ్‌ అమెరికాలో దాక్కోవడంపై అనుమానం వ్యక్తంచేసింది.

అదే నిజమైతే చైనా చరిత్రలోనే అతి పెద్ద వెన్నుపోటు అవుతుందని వ్యాఖ్యానించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తన కుమార్తె డాంగ్‌ యాంగ్‌తో కలిసి డాంగ్‌ జింగ్‌వీ అమెరికాకు వెళ్లిపోయి ఉండొచ్చని చైనా సోషల్‌మీడియాలో ప్రచారం ఊపందుకుంది.  
 
విషయం వెలుగుచూసిందిలా.. 
ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న చైనా మాజీ విదేశాంగ మంత్రి హాన్‌ లియాన్చావ్‌ ఈనెల 16న చేసిన ఒక ట్వీట్‌తో.. డాంగ్‌ జింగ్‌వీ పరారీ విషయం బాహ్య ప్రపంచానికి తెలిసింది. చైనా హోంశాఖ ఉపమంత్రి డాంగ్‌ జింగ్‌వీ పరారీ అంశం ఈ ఏడాది మార్చిలో అలస్కాలో జరిగిన అమెరికా-చైనా సమావేశంలోనూ ప్రస్తావనకు వచ్చిందని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘‘డాంగ్‌ను మాకు తిరిగి అప్పగించండి’’ అంటూ ఈసందర్భంగా అమెరికా సెక్రెటరీ ఆఫ్‌ స్టేట్‌ ఆంటోనీ బ్లింకన్‌, ఎన్‌ఎ్‌సఏ జాక్‌ సలైవాన్‌లకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ విజ్ఞప్తి చేశారని హాన్‌ వెల్లడించారు. అయితే ఈ అభ్యర్థనను అమెరికా తోసిపుచ్చిందని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

29, 30 తేదీల్లో మున్సిపల్‌ కార్యాలయాల వద్ద ఆందోళనలు: ఎపియుసిఎఫ్‌