Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ‘కొవిడ్‌ విముక్తి’ వేడుక

Advertiesment
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ‘కొవిడ్‌ విముక్తి’ వేడుక
, శుక్రవారం, 18 జూన్ 2021 (07:19 IST)
కరోనా వైరస్‌ మహమ్మారి దాటికి వణికిపోయిన అగ్రరాజ్యం అమెరికా.. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ముఖ్యంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం కావడం, కొవిడ్‌ మరణాలు తగ్గుముఖం పట్టడం, వైరస్‌ వ్యాప్తి అదుపులోకి రావడంతో మహమ్మారి నుంచి విముక్తి పొందినట్లు భావిస్తోంది.

ఈ నేపథ్యంలో జులై 4న జరిగే అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం రోజున భారీ స్థాయిలో వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమం ద్వారా మహమ్మారిపై అమెరికా విజయం సాధించిందనే విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించాలని జో బైడెన్‌ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
 
కుదుటపడుతోన్న అమెరికా..
వైరస్‌ ఉద్ధృతితో గడిచిన ఏడాదిన్నర కాలంగా అమెరికాలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కొవిడ్‌ ఆంక్షలు అమలు చేశారు. దీంతో ప్రజలు అత్యవసరం తప్పితే ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. ముఖ్యంగా ఇతర ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలవలేకపోవడంతో పాటు విహార యాత్రలకూ దూరమయ్యారు.

విమాన ప్రయాణాలు, వాణిజ్య సంస్థలు, బార్లు, రెస్టారంట్లు తిరిగి తెరచుకుంటున్నాయి. చాలా రాష్ట్రాలు బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలను తొలగించడంతో పాటు మాస్కుల నిబంధనలను సడలిస్తున్నాయి. ఇలా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలోకి రావడంతో అమెరికన్లు ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఈ సమయంలో కరోనా విజృంభణ కంటే ముందున్న వాతావరణాన్ని తిరిగి తీసుకురావాలని అమెరికా భావిస్తోంది. జులై నాలుగో తేదీన జరుపుకునే స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఇందుకు వేదికగా మలచుకోవాలని వైట్‌హౌస్‌ నిర్ణయించింది.
 
వైట్‌హౌస్‌లో వేడుకలు..
కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టడంతో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలను ఈసారి అట్టహాసంగా నిర్వహించాలని వైట్‌హౌస్‌ భావిస్తోంది. ఇందులో భాగంగా, కొవిడ్‌ పోరులో ముందునిలిచిన పౌరులు, వివిధ విభాగాలకు చెందిన నిపుణులు, ఆర్మీ సిబ్బందితోపాటు వారి కుటుంబ సభ్యులకు వైట్‌హౌస్‌ గార్డెన్‌లో ఆతిథ్యం ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో దాదాపు వెయ్యిమందికి పైగా ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇలాంటి వేడుకలు జరుపుకోవడాన్ని స్వాగతిస్తామని తాజాగా అన్ని రాష్ట్రాలకు రాసిన లేఖలో వైట్‌హౌస్‌ పేర్కొంది. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారీ స్థాయిలో జరుగనున్న వేడుకలు ఇవే కావడం గమనార్హం.
 
ఇదిలా ఉంటే, కరోనా వైరస్‌కు అత్యంత ప్రభావితమైన దేశాల్లో అమెరికా ముందుంది. ఇప్పటివరకు అక్కడ 3కోట్ల 34లక్షల మందిలో వైరస్‌ బయటపడగా.. 6లక్షల మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలు అమెరికాలోనే చోటుచేసుకున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రామీణ ప్రాంతాలలో పని చేసేందుకు ఆసక్తి చూపాలి: మంత్రి పేర్ని నాని