మహిళలు సౌందర్య ప్రియులన్న సంగతి అందరికీ తెలిసిందే. వారి సౌందర్య ప్రియత్వం వస్త్ర ధారణ, ఆభరణాలకు మాత్రమే పరిమితం కాదు. తమ ఇంటిలోని ప్రతి స్థానం ఎప్పుడూ క్రొత్తగా, అందమైన అలంకరణతో ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం నిత్యం కొత్త ఆలోచనలకు పదును పెడుతుంటారు. డ్రాయింగ్‌రూం, బెడ్‌రూం, బాత్‌రూం వరకు అన్నింటా కొత్తదనాన్ని ఆశిస్తారు. అయితే ఈ కొత్తదనం కోసం ప్రతిసారీ బజారు నుండి కొత్త వస్తువులను తీసుకుని రావడం అనేది జరగని పని.
ఉదాహరణకు మీ ఇంట్లో ఒక హాలు ఉందనుకోండి. అందులోని దివాన, సోఫాల స్థలం మార్చితే హాలులో ఓ కొత్త మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది. అదేవిధంగా మీ ఇంట్లో కూర్చునే దిశ కూడా అప్పుడప్పుడూ మార్చుతూ ఉంటే మీ ఇల్లు ఎప్పుడూ కొత్తదనంతో కళకళలాడుతుంది. మన ఇంటికి కొత్త అందాలు ఇవ్వాలంటే కొత్త మార్పులు చెయ్యాల్సిందే.
హాలులో కొత్త మార్పుల కోసం అక్కడి సోఫా, కుర్చీలను కొంచెం దూరంగా జరిపి వాటిని మీకు నచ్చినట్లు వేసి, మధ్యలో అందమైన కార్పెట్ వేస్తే ఆ అందమే వేరు. ముఖ్యంగా ఎర్ర కార్పెట్ అయితే వచ్చే బంధుమిత్రులకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. కూర్చునే పద్ధతి కూడా విశ్రాంతిదాయకంగా వుంటుంది. ఇది గదికి కూడా ఒక విధమైన అందాన్ని తెస్తుంది.
ఇంటి లోపలి గుమ్మాలు, కిటికీలకు ఉన్న తెరలను అప్పుడప్పుడూ మార్చుతూ ఉండాలి. అందుకోసం ప్రతిసారి కొత్తవి కొనవలసిన అవసరం లేదు. ఒక గదిలోని తెరను వేరే గదికి, మరొక గది తెరను వేరొక గదికి మార్చడం ద్వారా కొత్త దనాన్ని ఆస్వాదించవచ్చు. ఇక గోడల మీద ఉన్న చిత్రాలు వాటి స్థానాలను కూడా అప్పుడప్పుడూ మార్చుకోవడం ద్వారా ఎప్పుడూ కొత్తదనం కావాలనుకునే మీ మనసును మీ చేతిలో ఉంచుకోవచ్చు.
తెరలు, టేబిల్ క్లాత్‌లు వంటి వాటిపై రంగు, రంగులతో చేసే అలంకరణ కూడా మనసుకు హత్తుకొనే కొత్త అందాలకు దారి తీస్తుంది. దీనికై మీరు తళుకు బెళుకులు గల రంగులను ఉపయోగించకూడదు. ముఖ్యంగా మీ ఇంట్లో పిల్లలు రంగుల పట్ల ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. అయితే మీ భార్యా భర్తలకు మాత్రం పరిమితమయ్యే బెడ్ రూం రంగు మాత్రం లైట్ కలర్‌లో ఉంటే బాగుంటుంది.
ఇంట్లోని లైటింగ్ పద్ధతిలో కూడా కొన్ని మార్పులు చేయడం ద్వారా గదికి కొత్త రూపాన్ని ఇవ్వొచ్చు. పిల్లల గదుల్లో అయితే రంగు రంగుల బల్బులు. మీ భార్యా భర్తలకు మాత్రం క్రీం తరహాల లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే ఈ మార్పులను మీరు నిజంగా ఆహ్వానిస్తారు. ఈ విధంగా కొత్త ఆలోచనలు మీకు మీరే ఆలోచించుకొని మీ గృహాన్ని స్వర్గంగా మార్చుకోవచ్చు.