‘రక్తంలో ప్లేట్‌లెట్లు పడిపోయాయ’నే మాట ఇటీవల తరచూ వినిపిస్తోంది. రక్తంలో ముఖ్యభూమిక పోషించే ఈ ప్లేట్‌లెట్లు కణజాలాల మరమ్మతుకు, దెబ్బలు తగిలిన చోట రక్తం గడ్డకట్టడానికి, పుండ్లు త్వరగా మానడానికి తోడ్పడతాయి.
ప్లేట్‌లెట్లు పెరగడానికి హెల్తీడైట్ చాలా అవసరం. అందుకోసం ఏమేం తినాలో చెబుతున్నారు ముంబయ్‌లోని ‘డైజెస్టివ్ హెల్త్ ఇనిస్టిట్యూట్’కు చెందిన న్యూట్రిషనిస్టులు.
అవేమిటంటే...!
బొప్పాయి ఆకుల్లో ఎన్నో ఫ్లేవనాయిడ్స్, అల్కాలాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాస్త చేదుగా ఉన్నప్పటికీ వీటిని తింటే 24 గంటల్లో ప్లేట్‌లెట్ కౌంట్‌లో పెరుగుదల కనిపిస్తుంది.
ప్రతీ రోజూ అరకప్పు గోధుమ గడ్డి రసంలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసుకుని తాగాలి.
ఎర్రటి దానిమ్మ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయి. రోగనిరోధక శక్తికి ఇవి బాగా తోడ్పడతాయి. రక్తంలోని ప్లేట్‌లెట్ల కౌంట్ పెరగడానికి దానిమ్మ గింజలు దోహదం చేస్తాయని ఇటీవల ఒక పరిశోధనలో తేలింది.
గుమ్మడికాయలో విటమిన్ ఏ తో పాటు ప్లేట్‌లెట్లను పెంచి, రెగ్యులేట్ చేసే లక్షణాలున్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల కణాల్లో ప్రొటీన్ ఉత్పత్తి అవుతుంది. ప్రొటీన్‌ను రెగ్యులేట్ చేయడమంటే ప్లేట్‌లెట్లను వృద్ధి చేయడమే.
నిమ్మ, కమలాఫలం, కివీ, పాలకూర, ఉసిరి, బ్రొకోలీల్లో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఫ్రీ రాడికల్ వల్ల జరిగే నష్టాన్ని తగ్గించి ప్లేట్‌లెట్లను పెంపు చేస్తుంది. వీటిని భోజనానికి భోజనానికి మధ్య సలాడ్స్‌గానూ తీసుకోవచ్చు.
వారంలో రెండుసార్లు ఒక చిన్న గిన్నెడు క్యారెట్, బీట్‌రూట్‌ను సలాడ్‌గా కానీ జ్యూస్ రూపంలోగానీ తీసుకుంటే రక్తంలో ప్లేట్‌లెట్లు పెరుగుతాయని ఒక పరిశోధనలో తేలింది.