ఒక్కో కోడిగుడ్డులో 212 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ గుడ్డులో ఎక్కడ ఉంటుందో తెలుసా...? గుడ్డు లోపలి పసుపుపచ్చని పదార్థంలోనే ఉంటుంది. కనుక ఒక గుడ్డును తినేవారికి ఎంచక్కా 212 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ చేరడం ఖాయం. ఐతే రోజుకు ఓ వ్యక్తికి కావలసిన కొలెస్ట్రాల్ కేవలం 300 మిల్లీగ్రాములు మాత్రమే. ఒక్క గుడ్డుతోనే 212 మి.గ్రా చేరిపోతే, ఇక సాయంత్రంపూట తినే మిరపకాయ్ బజ్జీలు, గారెలు, పకోడీలు.. వగైరా వగైరా తింటే, ఇక చెప్పేదేముంది... ఏకంగా 500 మి.గ్రాలు ఇంకా అంతకుపైనే చేరిపోవడం ఖాయం.
ఇలా రోజులో మోతాదుకు మించిన కొలెస్ట్రాల్ రక్తనాళాల్లోకి చేరి పేరుకుపోతుంటే అనారోగ్యం రాక ఏమవుతుంది. అంతేకాదండోయ్... ఇంకో సీరియస్ వ్యవహారం. ఇలా కొలెస్ట్రాల్ స్థాయిలు శరీరంలో పెరిగిపోతే గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. వీటిని నిరోధించాలంటే.. ముందుగా ఈ గుడ్డుపై కొద్దిగా టార్గెట్ పెట్టి తీరాల్సిందే.
ఏదేమైనప్పటికీ గుడ్డు రుచి చూడాలని జిహ్వ కొట్టుకుంటుంటే మాత్రం, గుడ్డు లోపలి పసుపుపచ్చ పదార్థం తీసేసి తెల్లని పదార్థాన్ని తినవచ్చు. ఎందుకంటే అందులో కొలెస్ట్రాల్ ఉండదు. కనుక... గుడ్డు తినేటపుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తినండి మరి. అలాగని టోటల్‌గా గుడ్డును మీ ఆహారం నుంచి తీసేయకండలా... కాస్త చూసుకుని తినండి. మీ ఆరోగ్యం వెరీ"గుడ్డు"గా ఉంటుంది. మీ ఆరోగ్యం మీ కుటుంబానికి మహాభాగ్యం.