మగజాతి అంతమైపోతుందా? ఎందుకంటే...
మేం మగాళ్లమంటూ విర్రవీగే మగజాతికి ఇదో దుర్వార్త. త్వరలోనే మగజాతి అంతరించిపోయే దిశగా సాగుతోందని యూనివర్సిటీ ఆఫ్ కెంట్ పరిశోధనలో తేలింది. పురుషుల పుట్టుకకు కీలకమైన 'వై' క్రోమోజోమ్ క్రమంగా కుచించుకుపో
మేం మగాళ్లమంటూ విర్రవీగే మగజాతికి ఇదో దుర్వార్త. త్వరలోనే మగజాతి అంతరించిపోయే దిశగా సాగుతోందని యూనివర్సిటీ ఆఫ్ కెంట్ పరిశోధనలో తేలింది. పురుషుల పుట్టుకకు కీలకమైన 'వై' క్రోమోజోమ్ క్రమంగా కుచించుకుపోతోందని వారి పరిశోధనలో వెల్లడైంది.
సాధారణంగా ప్రతి మనిషికీ ప్రతికణంలోనూ 23 జతల (46) క్రోమోజోములుంటాయి. వాటిలో 22 జతలు ఆటోజోమ్స్. మిగిలిన ఒక్క జత.. ఎక్స్, వై క్రోమోజోములు. వీటినే సెక్స్ క్రోమోజోమ్స్ అని పిలుస్తారు. తల్లి కడుపులో ఉన్న పిండం తాలూకూ లింగాన్ని నిర్ధారించేవి ఇవే. రెండు ఎక్స్‌లు కలిస్తే ఆడపిల్ల.. ఎక్స్, వై క్రోమోజోములు కలిస్తే మగపిల్లాడు పుడతారు. అలాంటి 'వై' క్రోమోజోమ్ ఇపుడు గతంతో పోలిస్తే బాగా కుచించుకుపోతోందట.
దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే... తొలినాళ్ల క్షీరదాల్లో ఎక్స్, వై క్రోమోజోములు ఒకే పరిమాణంలో ఉండేవి. ఎక్స్ క్రోమోజోములో ఉన్న అన్ని జన్యువులూ 'వై'లోనూ ఉండేవి. అయితే, 'వై' క్రోమోజోములో ఉన్న ప్రాథమిక లోపం ఏమిటంటే.. మిగతా అన్ని క్రోమోజోములూ రెండు కాపీలు ఉంటే (జతలుగా).. ఒక్క 'వై' క్రోమోజోమ్ మాత్రమే 'సింగిల్ కాపీ' ఉంటుంది. తండ్రి నుంచి కొడుక్కి వస్తుంది. సాధారణంగా తరాలు గడిచేకొద్దీ జన్యు ఉత్పరివర్తనాలు (జీన్ మ్యుటేషన్స్) జరుగుతుంటాయి.
అయితే, ‘వై’ క్రోమోజోముకు జెనెటిక్ రీకాంబినేషన్ సౌలభ్యం లేకపోవడంతో దానిలోని జన్యువులు తగ్గిపోతూ అది కుచించుకుపోవడం ప్రారంభించింది. ఇది ఇలాగే కొనసాగితే మరో 46 లక్షల సంవత్సరాలకు.. భూమ్మీద మగవాళ్లే లేకుండా అంతరించిపోతారని కెంట్ వర్సిటీ పరిశోధకులు అంచనా వేస్తున్నారు.