Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

70 శాతం అంటువ్యాధులకు అవే కారణం : ప్రపంచ ఆరోగ్య సంస్థ

70 శాతం అంటువ్యాధులకు అవే కారణం : ప్రపంచ ఆరోగ్య సంస్థ
, గురువారం, 15 ఏప్రియల్ 2021 (12:36 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి విలయతాండవం చేస్తోన్న వేళ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను మరోసారి అప్రమత్తం చేసింది. ముఖ్యంగా మాంసాహార మార్కెట్లలో అడవి జంతువుల విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించింది. కరోనా వైరస్‌ వంటి 70శాతం అంటువ్యాధులు ప్రబలడానికి ఈ అడవి జంతువులే కారణమవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టం చేసింది.
 
'మానవులలో వెలుగుచూస్తోన్న 70 శాతం అంటువ్యాధులకు మూల కారణం అడవి జంతువులే. ఇలాంటి అంటువ్యాధులు నోవెల్‌ కరోనా వైరస్‌ వల్ల కలిగేవే ఉంటున్నాయి' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నూతన మార్గదర్శకాల్లో పేర్కొంది. 
 
వైరస్‌ సోకిన అటువంటి జంతువుల శరీర ద్రవాలను తాకినప్పుడు అవి మానవులకు సంక్రమించే అవకాశం ఉంటుందని WHO పునరుద్ఘాటించింది. అంతేకాకుండా ఈ జంతువులను ఉంచిన ప్రదేశాల్లో వాతావరణం కలుషితమవడం మరింత ప్రమాదకరమని పేర్కొంది. 
 
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఎక్కువ మందికి ఆహార సరఫరా చేయడంతో పాటు జీవనోపాధిని కల్పించడంలో జంతువుల విక్రయ మార్కెట్లు కీలకంగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. అయినప్పటికీ.. ఇటువంటి జంతువుల అమ్మకాలను నిషేధించడం వల్ల విక్రేతలు, మార్కెట్‌కు వచ్చే ప్రజల ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని సూచించింది.
 
ఇక ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌ మహమ్మారి జాడలు చైనాలోని వుహాన్‌ నగరంలో బయటపడిన విషయం తెలిసిందే. అయితే, ఇవి ఎలా వ్యాప్తి చెందాయనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేకున్నప్పటికీ.. గబ్బిలాల నుంచి వ్యాపించినట్లు భావిస్తున్నారు. తొలుత గబ్బిలాల నుంచి చైనాలోని జంతువిక్రయ మార్కెట్లు, అక్కడి నుంచి ఇతర జంతువుల జాతుల ద్వారా మానవులకు వైరస్‌ సోకినట్లు అంచనా వేస్తున్నారు. 
 
కొవిడ్‌ మూలాలపై దర్యాప్తు జరిపిన అంతర్జాతీయ నిపుణుల బృందం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో అడవుల నుంచి పట్టుకుని వచ్చే జంతువుల విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నూతన మార్గదర్శకాల్లో సూచించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కండరాల శక్తి కోసం ఇలా చేయండి..