Publish Date: Fri, 19 Jul 2019 (16:20 IST)
Updated Date: Fri, 19 Jul 2019 (16:22 IST)
ఇప్పటికీ చాలామందికి కుంకుడుకాయల రసంతో తలస్నానం చేసే అలవాటు ఉంటుంది. కుకుండుకాయలు అనేవి ప్రకృతి ప్రసాదించిన వరం. ఈ కాయల రసంతో తలస్నానం చేయడం వల్ల జుట్టు ఒత్తుగా ఉంటుందని, చుండ్రు వంటివి పట్టవని చాలా మంది భావిస్తుంటారు.
అయితే, మరికొందరికి కుంకుడుకాయలతో తలస్నానం చేస్తే అస్సలు పడదు. కళ్లు ఉబ్బిపోయి ఎర్రగా మారిపోతుంటాయి. ఇంకొందరికి శరీరంపై దద్దులు వంటివి వస్తాయి. అంటే అలర్జీ వస్తుందని చెబుతున్నారు. నిజానికి కుంకుడుకాయల రసంతో తలస్నానం చేస్తే అలర్జీ వస్తుందా లేదా అనే విషయంపై వైద్యులను సంప్రదిస్తే,
కుంకుడుకాయల రసంతో తలస్నానం చేయడం ఎంతో మేలు. ఈ రసంలో ఉండే విటమిన్ ఏ, కే వంటి పోషకాలు అధిక మోతాదులో ఉంటాయి. అవి జుట్టుకు తగిన పోషణ అందించి, ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి. కుంకుండురసం కళ్లను మండేలా చేసినా అలర్జీ అనేది రాదు.
కుంకుడు గింజల్లో అతితక్కువ మోతాదులోనే అలర్జీ కారకం ఉంటుంది. అయితే, మార్కెట్‌లో కొన్నవాటిలో ఎక్కువ రోజులు నిల్వవున్నా, కల్తీ జరిగినా ఆ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. అందువల్ల కుంకుడుకాయలను ఎంచుకునేముందు నాణ్యమైన కాయలను ఎంచుకున్నట్టయితే ఎలాంటి సమస్యారాదు.