గురక సమస్య మద్యపానం వల్ల వస్తుంది. సైనసైటిస్, ఎడినాయిడ్స్, ముక్కులో పాలిప్స్ వల్ల కూడా గురక తప్పదు. అలాంటి గురకను దూరం చేసుకోవాలంటే.. ఆహారాన్ని రాత్రిపూట మితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్య ఉన్నవారు రాత్రిపూట పెరుగు తినకూడదు. అలాగే నిద్రపోయేముందు వేడి నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి.
మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. నిద్రమాత్రలు అలవాటు ఉంటే తగ్గించుకోవాలి. ప్రాణాయామం చేయడం ద్వారా ముక్కు, గొంతులోని కండరాలు దృఢంగా మారి గురక సమస్య దూరం అవుతుంది.
ఇంకా గురకను దూరం చేసుకోవాలంటే.. నిద్రకు ముందు గోరు వెచ్చని ఆవనూనెను రెండు లేదా మూడు చుక్కలు ముక్కులో వేసుకుంటే మంచిది. శొంఠి, పిప్పళ్లు, మిరియాలను సమానంగా కలిపి చూర్ణం చేసుకోవాలి. ఈ పొడి అరచెంచాడు పరిమాణంలో కొద్దిగా తేనె కలిపి రాత్రి పూట తీసుకోవాలి.
ఇంకా ఓ కప్పు నీటిలో 25 పుదీనా ఆకులు వేసి బాగా మరిగించి, గోరువెచ్చగా తాగితే, గురక తగ్గుముఖం పడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
ఆహారాన్ని ఒకేసారిగా తీసుకోకుండా.. కొంచెం కొంచెంగా తీసుకోవడం ద్వారా శ్వాస తీసుకోవడం సులభమవుతుంది. రాత్రి పూట ఆహారాన్ని 8 గంటలకు ముందే తీసుకోవాలి. ఇలా చేస్తే గురక సమస్యను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
ఇంకా అధిక బరువు కూడా గురకకు కారణమవుతుంది. అందుకే బరువు నియంత్రణ చాలా ముఖ్యం. అంతేగాకుండా వ్యాయామాన్ని భాగం చేసుకోవాలి.
ముఖ్యంగా పైనాపిల్‌ను రోజు రెండు కప్పుల మేర తీసుకుంటే గురకను దూరం చేసుకోవచ్చు. ఇందులో యాంటీ-ఇన్ఫ్లమేటరీ శ్వాస ఇబ్బందులను తొలగిస్తుంది.