Publish Date: Wed, 02 Jan 2019 (15:43 IST)
Updated Date: Wed, 02 Jan 2019 (15:44 IST)
అవును. వృద్ధాప్యంలో చాలామంది మాంసాహారాన్ని పక్కనబెట్టేయడం చేస్తుంటారు. అయితే మాంసాహారంలో భాగమైన సీఫుడ్ లిస్టులో వున్న చేపలను మాత్రం వృద్ధాప్యంలో తప్పకుండా తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు. మటన్, చికెన్‌ను పక్కనబెట్టేసినా పర్లేదు కానీ.. చేపలను మాత్రం తీసుకోకుండా వుండకూడదని వారు సూచిస్తున్నారు.
వృద్ధాప్యంలో గుండె జబ్బులు, నొప్పులు, అధిక రక్తపోటు వంటి రుగ్మతలు ఎదుర్కోవాల్సి వుంటుంది. వీటికి మందులు తీసుకోవడమే కాకుండా ఆహారంలో రోజుకు పావు కప్పైనా చేపలు తీసుకుంటే ఎంతో మేలు చేకూరుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా వుండే ఈ చేపలను తీసుకోవడం ద్వారా గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చు.
హైబీపీని పక్కనబెట్టేయవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సముద్రపు చేపల్లో పోషకాలు పుష్కలంగా వుంటాయి. చేపల్లో మాంసకృత్తులు, విటమిన్ ఎ, విటమిన్ డి, ఫాస్ఫరస్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. గట్టి ఎముకలకు, పళ్లకు అవసరమయ్యే ఫ్లోరిన్‌తో పాటు.. రక్తవృద్ధికి అవసరమయ్యే హీమోగ్లోబిన్ పెరగడానికి, అందుకు కావాల్సిన ఇనుము చేపల్లో విరివిగా లభిస్తుంది.
అలాగే బానపొట్ట రాకుండా ఉండాలంటే వారానికి కనీసం రెండు సార్లయినా చేపలు తినడం మంచిది. అందుకే వయోబేధం లేకుండా చేపలు తీసుకోవచ్చునని.. తద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని వైద్యులు చెప్తున్నారు.