మెదడు చురుకుగా ఉండాలని కోరుకునే వారు వ్యాయామం చేయడానికి ముందు బీట్‌రూట్ రసాన్ని త్రాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే విషయగ్రహణ సామర్థ్యం, భావోద్వేగాలు మెరుగ్గా ఉంటాయని, కదలికలతో ముడిపడిన మెదడు భాగాలు ఆరోగ్యంగా ఉంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. బీట్‌రూట్‌లో నైట్రేట్ అధికంగా ఉంటుంది.
వ్యాయామం చేసేటప్పుడు త్వరగా అలసిపోకుండా చూడటానికి, మెదడుకు రక్త సరఫరా మెరుగవ్వటానికి ఇది తోడ్పడుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. మెదడు ఆయుష్షు కూడా పెరుగుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ చాలా శక్తివంతమైంది. ఇది మన శరీరంలో ఆక్సిజన్ అవసరమైన భాగాల్లోకి చొచ్చుకొని వెళ్తుంది. ఆక్సిజన్‌ను పెద్దమొత్తంలో వినియోగించుకునే అవయవం మెదడే.
కాబట్టి ఇది మెదడుకు మరింత ఎక్కువగా ఆక్సిజన్ సరఫరా అయ్యేలా చేస్తుంది. బీట్‌రూట్‌లోని నైట్రేట్ ముందు నైట్రైట్‌గానూ, అనంతరం నైట్రిక్ ఆక్సైడ్‌గానూ మారుతుంది. ఇది రక్తనాళాలు విప్పారేలా చేస్తుంది. ఫలితంగా రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది.
బీట్‌రూట్ రసంతో రక్తపోటు తగ్గుతున్నట్టు కూడా గత అధ్యయనాల్లో వెల్లడైంది. ఇది కూడా మెదడుకు మేలు చేసేదే. కాబట్టి బీట్‌రూట్‌ను ఆహారంలో భాగంగా చేసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.