మాంసాహారాలలో చికెన్, మటన్ కన్నా చేపమాంసం సులువుగా జీర్ణమవుతుంది. సాధారణంగా వైద్యులు సైతం చేపలు ఎక్కువగా తినమని సలహా ఇస్తుంటారు. అలాగే హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న వారు చేపలను తినడం మంచిదని కూడా సూచిస్తుంటారు. తాజాగా జరిపిన పరిశోధనలలో చేపమాంసం తినడం వల్ల ఆస్తమాకు చెక్ పెట్టొచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఆస్తమా అనేది చాలా తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. ఆస్ట్రేలియాలోని జేమ్స్ కుక్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు దక్షిణాఫ్రికాలోని ఓ గ్రామానికి చెందిన 600 మందిపై పరిశోధన జరపగా, ఈ విషయం వెల్లడైంది.
గత ముప్పై ఏళ్లలో ఆస్తమా వ్యాధిగ్రస్తుల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. అలాగే ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మందులతో ఎలాంటి ఉపశమనం లభించడం లేదు అని యూనివర్శిటీ శాస్త్రవేత్త ఆండ్రియాస్ లొపాటా అన్నారు. సముద్ర జీవులైన చేపలు, ఇతర జీవ ఉత్పత్తుల్లో నుండి తీసే నూనెలో లభించేటువంటి ఎన్-3 పాలీసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ (పుఫా) తీసుకున్న వారిలో ఆస్తమా సంబంధిత సమస్యలు 62 శాతం వరకు తగ్గినట్లు గుర్తించారు.
అలాగే కూరగాయల ద్వారా లభించే ఎన్-6 పాలీసాచురేటెడ్ ఆయిల్స్ తీసుకున్నవారిలో ఆస్తమా సంబంధిత సమస్యలు 67 శాతం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. తీర ప్రాంతాల్లో నివసిస్తూ చేపల వేటనే ఆధారంగా చేసుకుని జీవనాన్ని నెట్టుకొస్తున్న వారిని, అలాగే చేపలను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటున్న గ్రామ ప్రజలపై ఈ పరిశోధన నిర్వహించినట్లు ఆండ్రియాస్ లొపాటా తెలిపారు.