Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జ్ఞాపకానికి ‘మాట’ తోడు

జ్ఞాపకానికి ‘మాట’ తోడు
, బుధవారం, 22 సెప్టెంబరు 2021 (08:42 IST)
మనిషికి మనిషి తోడు. వెంట ఎవరైనా ఉంటే మంచీ చెడూ మాట్లాడుకోవచ్చు. దీంతో మనసు తేలిక పడుతుంది. అంతేనా?.. మెదడు ఆరోగ్యమూ ఇనుమడిస్తుంది.

ఇటీవల వైద్యపత్రిక జామాలో ప్రచురితమైన అధ్యయనం ఇదే పేర్కొంటోంది. మనం చెప్పేది శ్రద్ధగా వినేవారుంటే విషయ గ్రహణ సామర్థ్యం (ఆలోచన, హేతుబద్ధత, జ్ఞాపకశక్తి) క్షీణించే అవకాశం తక్కువగా ఉంటున్నట్టు తేలింది మరి.

మెదడులో అల్జీమర్స్‌ మాదిరి మార్పులున్నా ‘మాట తోడు’ ప్రభావం కనిపిస్తుండటం గమనార్హం. ప్రస్తుతానికి అల్జీమర్స్‌ను నయం చేసే చికిత్స ఏదీ లేదు.

ఈ నేపథ్యంలో అల్జీమర్స్‌ లక్షణాలను నివారించుకోవటానికి, విషయ గ్రహణ సామర్థ్యం త్వరగా క్షీణించకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశముందని తాజా అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.
 
మనదేశంలో సుమారు 50 లక్షల మంది అల్జీమర్స్‌తో బాధపడుతున్నారని అంచనా. ఇది జ్ఞాపకశక్తి, భాష, నిర్ణయాలు తీసుకోవటం, స్వతంత్రంగా జీవించటాన్ని గణనీయంగా దెబ్బతీస్తుంది.

అల్జీమర్స్‌ ప్రధానంగా వృద్ధాప్యంలోనే దాడి చేస్తుంది కాబట్టి 65 ఏళ్ల కన్నా చిన్నగా ఉన్నవారు సామాజిక తోడ్పాటుతో గణనీయమైన ప్రయోజనాన్ని పొందే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు.

40ల్లో, 50ల్లో ఉన్నప్పుడు మనం చెప్పేది శ్రద్ధగా వినేవారు ఎక్కువగా ఉన్నవారితో పోలిస్తే తక్కువగా ఉన్నవారిలో విషయ గ్రహణ సామర్థ్యం వయసు నాలుగేళ్లు అధికంగా ఉంటోందని వివరిస్తున్నారు.
 
ఈ నాలుగు సంవత్సరాలు చాలా కీలకం. ఎందుకంటే చాలామంది వయసు మీద పడ్డాకే మెదడు ఆరోగ్యాన్ని పెంచుకోవటం గురించి ఆలోచిస్తుంటారు. నిజానికి మెదడు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడే అలవాట్లను అలవరచుకునే విలువైన సమయం అప్పటికే మించిపోతుంది.

ఇందుకోసం పెద్ద పెద్ద పనులేమీ చేయక్కర్లేదు. మంచి సామాజిక సంబంధాలు కలిగుండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వంటి చిన్న చిన్న మార్పులైనా గణనీయమైన ప్రభావాన్ని చూపించగలవని పరిశోధకులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొలకెత్తిన గింజలు ... ఆరోగ్యానికెంతో మంచివి"..!