తెలుగోడి తెగువకు నిలువుటద్దంలా తెల్లటి పంచెకట్టు, నిండైన ఆహర్యం, అన్నివేళలా ఆకట్టుకునే చిరుదరహాసం.. మడమతిప్పని గుణం.. ఎవరికైనా ఎదురెళ్లే మొండి ధైర్యం.. సాయం కోరి వచ్చిన వారికి అండగా నిలిచే తత్వం.. అభాగ్యులను అక్కున చేర్చుకుని అభిమానించే స్వరం.. ఇవి రాజన్న పేరు గుర్తుకొస్తే.. కళ్లముందు కదలాడే రూపం వెనుకున్న జ్ఞాపకాలు. పాద యాత్ర పేరుతో జనంలోకి వెళ్లి.. అదే జనంలోంచి వచ్చిన మాస్ లీడర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నేడు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆ జననేతకు ఘన నివాళి అర్పిద్దాం...
అది 1949, జులై 8.. వైఎస్ఆర్ పుట్టిన రోజు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో జయమ్మ, రాజారెడ్డి దంపతులకు పుట్టిన సంతానమే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అప్పటికే స్థానికంగా ప్రజా జీవితంలో ఉన్న రాజా రెడ్డికి వారసుడిగా వైద్యుడి రూపంలో నిరుపేదలకు సేవ చేస్తూ సామాజిక సేవను అలవర్చుకున్న రాజశేఖర్ రెడ్డి.. రాజకీయాల్లోకి ప్రవేశించాకా అదే సేవా భావంతో ప్రజలకు మరింత చేరువయ్యారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ తమ పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజల మధ్యే ఉంటూ ప్రజల మనిషి అయ్యారు.
2004లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి తెలుగు దేశం పార్టీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ పాదయాత్రతో చంద్రబాబు నాయుడికి ఎదురెళ్లిన దీశాలి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల పల్లెటూరు వరకు ప్రాంతాలన్నీ కలియతిరుగుతూ, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ.. వారికి నేనున్నానని భరోసానిస్తూ ముందుగుసాగాడు.
అప్పుడు ఊపుమీదున్న తెలుగు దేశం పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ డీలాపడిన కాంగ్రెస్ పార్టీకి తిరిగి కొత్త జోష్‌నిచ్చిన నాయకుడు. ఆ పాదయాత్ర ఫలితమే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మళ్లీ పట్టం కట్టడం... 2004, మే 14న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
తొలి సంతకం చేసింది ఆ ఫైలుపైనే..
ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన ''రైతులకు ఉచిత విద్యుత్ హామీ''ని నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతోనే అదే ఫైలుపై ఆయన తొలి సంతకం చేశారు.