కోరింగ 'మడ'పై కత్తి : ఇళ్ళ స్థలాల కోసం అడ్డగోలుగా నరికివేత

మంగళవారం, 12 మే 2020 (10:24 IST)
తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు 14 కిలోమీటర్ల దూరంలోని కోరంగి వద్ద ఉన్న మడ అడవులపై వైకాపా ప్రభుత్వం కత్తివేటు వేసింది. ఇళ్ళ స్థలాల పేరుతో ఈ అడవులను అడ్డంగా నరికేసింది. దేశంలో రెండో అతిపెద్ద సుందరవనంగా గుర్తింపు పొందిన ఈ మడ అడవుల అభయారణ్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ఏపీ సర్కారు అడ్డగోలుగా నరికేసింది. ఈ విషయం బయటకు పొక్కడం, అది కోర్టుకు చేరడంతో అసలు.. ఈ ప్రాంతం అటవీ ప్రాంతం కిందకే రాదంటూ అడ్డగోలుగా వాదిస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కోరంగి అడవులపై ప్రత్యేక కథనం. 
 
కాకినాడ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో కాకినాడ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని కోరంగి వద్ద ఈ మడ అడవులు విస్తరించివున్నాయి. ఐ పోలవరం మండలంలోని భైరవపాలెం, కోరంగిల మధ్య 23570.29 హెక్టార్ల విస్తీర్ణంలో ఇవి వ్యాపించివున్నాయి. ఈ అటవీ ప్రాంతంపై ఆధారపడి ఏకంగా 18 మత్స్యకారగ్రామాల కుటుంబాలకు చెందిన 55 వేల మంది ప్రజలు నివసిస్తున్నారు.
 
చిత్తడి నేలల్లో ఎక్కువగా పెరిగే మడ అడవులు.. సాల్ట్ క్రిక్స్‌ పాండ్‌లో అరుదైన జీవరాశుల ఆవాసం ఉంటాయి. ముఖ్యంగా, కాకినాడ  ప్రాంతాన్ని 1996, 98లలో తుఫానుల నుంచి రక్షించింది ఈ ఫారెస్టే. అంతేనా, 2004లో వచ్చిన సునామీ నుంచి కాకినాడ రేవు పట్టణం సురక్షితంగా బయటపడిందంటే దానికి కారణం ఈ మడ అడవులే. అంతేకాకుండా, కాకినాడకు ముప్పువుందని జాతీయ, అంతర్జాతీయ పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయినా, వైకాపా సర్కారు ఇవేమీ పట్టించుకోవడం లేదు. 
 
గంగానది సముద్రంలో కలిసే చోట ఏర్పడిన వెస్ట్ బెంగాల్‌లోని సుందరవనాలు మన దేశంలో అతిపెద్ద మడ అడవులు అయితే, గోదావరి తీరంలోని ఈ కోరింగ మడ అడువులు దేశంలో రెండో అతిపెద్ద సుందర వనాలుగా గుర్తింపునకు నోచుకున్నాయి. ఆంగ్లంలో మ్యాంగ్రో ఫారెస్ట్ అంటారు. కోరింగని 1978లో భారత ప్రభుత్వం రక్షిత అటవీ ప్రాంతంగా ప్రకటించింది. ఆ తర్వాత 1998లో తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తెచ్చి కోరింగ అభయారణ్య సంరక్షణకు, సందర్శనలకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.
 
సముద్రపు నీటి కంటే అధిక గాఢత కలిగిన నీరు దీని ప్రత్యేకత. 119 రకాల జీవజాతులకు ఈ మడ అడవులు ఆవాసం కల్పిస్తున్నాయి. 120 పక్షి జాతులకు మడ అడవులు విడిదికి కేంద్రం. కొల్లేరు, పులికాట్ సరస్సుల తర్వాత ఆ స్థాయిలో వలస పక్షులు వచ్చేది కోరింగ అభయారణ్యానికే. మైమరపించే ప్రకృతి సౌందర్యంతో పాటు విభిన్నమైన జీవవైవిధ్యం అధిక సంఖ్యలో కలిగిన అభయారణ్యంగా ఐక్యరాజ్య సమితి ఈ ప్రదేశాన్ని గుర్తించడం జరిగింది. 
 
ఇలాంటి మడ అడవులను ఇళ్ళ స్థలాల పేరిట 100 ఎకరాల మేరకు నిర్ధాక్షిణ్యంగా నరికేసింది వైసీపీ ప్రభుత్వం. చేసింది చాలక.. ఈ భూములు అసలు మడ అడవుల కిందికేరావని కోర్టులో అడ్డంగా వాదిస్తోంది. నరికేసింది మడ అడువులను కాకపోతే, ఆ అడవులపై ఆధారపడి జీవనం సాగించే దుమ్ములపేట, పర్గోపేట మత్స్యకారులతోపాటు 18 గ్రామాల మత్స్యకారులు ఎందుకు ఆందోళన చేస్తున్నారో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్.. వాట్సాప్ వెబ్‌లో వీడియో కాల్స్