ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డికి పదవీగండం తప్పదా? దీనికి గతంలో జరిగిన ఓ సంఘటనను వైకాపా నేత ఒకరు ఉదహరిస్తున్నారు. అదేంటంటే.. విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో ముఖ్యమంత్రి హోదాలో దివంగత ఎన్టీఆర్ అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆయన పదవీచ్యుతుడయ్యాడని గుర్తుచేస్తున్నారు. ఇపుడు కూడా కేజీహెచ్‌లో అడుగుపెట్టిన జగన్మోహన్ రెడ్డికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురుకానుందా? అనే ప్రశ్నకు వైకాపా నేత, ప్రముఖ సినీ నిర్మాత పీవీపీ వరప్రసాద్ తనదైనశైలిలో బదులిచ్చారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు.
గతంలో కేజీహెచ్‌లో అడుగుపెట్టిన తిరిగి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారని గుర్తు చేశారు. ఈ సంఘటన 1995లో జరిగిందని గుర్తుచేశారు. ఆ తర్వాత ఒక ముఖ్యమంత్రి ధైర్యం చేసి 25 సంవత్సరాల తర్వాత మళ్లీ విశాఖ కేజీహెచ్‌లో అడుగుపెట్టారని చెప్పారు.
ఎన్టీఆర్ తర్వాత అక్కడ మరే ముఖ్యమంత్రి అడుగుపెట్టలేదన్నారు. కానీ, మళ్లీ ఇప్పుడు ప్రజల కోసం జగన్ అడుగుపెట్టారని చెప్పారు. ఇక్కడ పదవి పోతుందని జగన్ భయపడలేదనీ, జగన్‌కు ప్రజా సంక్షేమమే ప్రధానమని, పదవి కాదని అన్నారు. గ్యాస్ లీక్ ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు కేజీహెచ్ ఆసుపత్రికి జగన్ వెళ్లిన సంగతి తెలిసిందే.