2024లో జరిగే ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని, ఆ తర్వాత తమను వేధించిన, తమపై తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్క పోలీస్ అంతు చూస్తామని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు హెచ్చరించారు.
ఇటీవల మాచర్ జిల్లాలో వైకాపా నేతలు చేసిన దమనకాండపై ఆయన మాట్లాడుతూ, మాచర్ల నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలకు పోలీసుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. మాచర్లలో జరిగిన అల్లర్లతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు భయపెడుతున్నారన్నారు. పైగా, మాచర్లలో సైతం భయానక వాతావరణం సృష్టిస్తున్నారని తెలిపారు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన, పెడుతున్న ప్రతి ఒక్క పోలీస్ కానిస్టేబుల్, అధికారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వైకాపా ఆరిపోయే దీపమని, రానున్న రోజుల్లో వైకాపా నేతలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. అదేసమయంలో వైకాపా నేతలు, పోలీసులు కుమ్మక్కై వేధింపులకు గురిచేసినా టీడీపీ కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని పిలుపునిచ్చారు.