Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైడ్రాక్సీక్లోరోక్వీన్ కోసం అగ్రదేశాలు ఎందుకు భారత్ వెంటపడ్డాయి?

హైడ్రాక్సీక్లోరోక్వీన్ కోసం అగ్రదేశాలు ఎందుకు భారత్ వెంటపడ్డాయి?
, గురువారం, 9 ఏప్రియల్ 2020 (11:33 IST)
కరోనా వైరస్ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. దీనికి కారణం ఈ వైరస్‌ను అడ్డుకునే సరైన మందు లేకపోవడమే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందుల్లో హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రమే కొంతమేరకు ఈ వైరస్ ప్రభాన్ని అడ్డుకోగలుగుతుందని ఒక ఫ్రెంచ్ కంపెనీ జరిపిన పరిశోధనలో తేలింది. దీంతో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా వంటి అగ్రదేశాలు ఈ ఔషధం కోసం భారత్ వెంటపడ్డాయి. ఈ మందును సరఫరా చేయకుంటే భారత్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ అగ్రదేశాధినేత డోనాల్డ్ ట్రంప్‌.. భారత్‌ను పరోక్షంగా హెచ్చరించారంటే పరిస్థితిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అలా మిగిలిన అగ్రదేశాలు కూడా భారత్ వెంటపడటానికి కారణాలు ఏంటో ఇపుడు తెలుసుకుందాం. 
 
ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందిన దేశాల్లో మలేరియా వంటి వ్యాధులు తక్కువ. పైగా ఈ మందు చాలా చవక. దీనిని భారీగా ఉత్పత్తి చేయడం వల్ల ఫార్మా కంపెనీలకు పెద్దగా లాభాలు రావు. దీంతో అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాలు దీనిని ఉత్పత్తి చేయడం మానేశాయి. దీన్ని అవకాశంగా తీసుకొని భారత్‌, చైనాలు ఈ మందును ఎక్కువ మోతాదుల్లో తయారుచేస్తున్నాయి. మన దేశంలో ఇప్కా లేబొరేటరీస్‌, జైడస్‌ కేడిలా కంపెనీలతో పాటు అనేక స్థానిక కంపెనీలు కూడా దీన్ని ఉత్పత్తి చేస్తున్నాయి.
 
ప్రపంచంలో అత్యధిక మోతాదులో హైడ్రోక్లోరోక్వీన్ మాత్రలను తయారు దేశాల్లో భారత్ మొదటిది. అయితే ఈ మందు తయారీకి అవసరమైన యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియంట్‌ (ఏపీఐ)లో 70 శాతాన్ని చైనా నుంచే భారత్ దిగుమతి చేసుకుంటుంది. కరోనా వైరస్‌ వ్యాప్తిచెందడం మొదలు పెట్టిన తర్వాత ఈ డ్రగ్‌కు విపరీతంగా గిరాకీ పెరిగింది. 
 
అదేసమయంలో ఇప్కా లేబొరేటరీస్‌, జైడస్‌ కేడిలా కంపెనీలకు అమెరికా నుంచి భారీ ఆర్డర్లు లభించాయి. దీంతో ఈ కంపెనీలు తమ ఉత్పత్తిని దాదాపు మూడు రెట్లు పెంచాయి. మరోవైపు.. స్థానికంగా ఉన్న చిన్న ఫార్మా కంపెనీలు కూడా ఈ మందును తయారుచేయడం మొదలుపెట్టాయి. దీంతో ఇతర దేశాలకు ఎగుమతి చేసిన తర్వాత కూడా అవసరమైనన్ని నిల్వలు ఉన్నాయని కేంద్రం మంగళవారం ప్రకటించింది.
 
అయితే, ఈ మందును అమెరికా తయారు చేసుకోలేదా అనే సందేహం ప్రతి ఒక్కరిలో కలుగవచ్చు. నిజానికి అమెరికాలో మలేరియా వంటి వ్యాధులు అతి తక్కువగా వస్తాయి. దీంతో ఆ దేశం వద్ద ఈ మందు నిల్వలు ఎక్కువగా లేవు. కరోనా వైరస్‌ వల్ల వచ్చే కొన్ని లక్షణాలను నివారించడంలో ఈ మందు పనికొస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. దీంతో అమెరికాలో ఈ మందుకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. కానీ అన్ని నిల్వలు అమెరికా ప్రభుత్వం వద్ద లేవు. 
 
ఈ నేపథ్యంలో జర్మనీకి చెందిన ఒక ఫార్మా కంపెనీ అమెరికా ప్రభుత్వానికి మూడు కోట్ల డోస్‌లను విరాళంగా ఇచ్చింది. అయితే రోజు రోజుకూ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుండటంతో అమెరికా ప్రభుత్వం మరిన్ని డోస్‌లు అవసరమని గుర్తించి.. ఈ మందును సరఫరా చేయాలని భారత్‌ను కోరింది. అలాగే, ఇతర అగ్రదేశాలు కూడా భారత్‌ను ఆశ్రయించాయి. దీంతో భారత్ హెచ్.సి.క్యూ ఉత్పత్తిని భారీ స్థాయిలో పెంచింది. పైగా, మనకు తగినన్ని నిల్వలు ఉంచుకున్న తర్వాతే మిగిలిన దేశాలకు ఈ మాత్రలను ఎగుమతి చేయాలని నిర్ణయం తీసుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌.. కుమార్తె పెళ్లి ఆగిపోతుందని తండ్రి మృతి