ప్రపంచం నలుమూలల జరిగే వివిధ రకాల సంఘటనలను సేకరించి ఎప్పటికపుడు అందిస్తూ వస్తున్న తొలి తెలుగు ఆన్‌లైన్ పోర్టల్ వెబ్‌దునియా. 1999లో పురుడుపోసుకున్న మీ, మా వెబ్ దునియా తెలుగు అప్పటి నుంచి నిరంతరాయంగా సేవలు అందిస్తూనే వుంది.
దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం లక్షలాది మంది వ్యూవర్‌షిప్‌ను కలిగివుంది. యూజర్ల ఆశీర్వాదాలతో వెబ్‌దునియా 20వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ నెల 23వ తేదీతో 19 సంవత్సరాలు పూర్తి చేసుకుని 20వ పుట్టినరోజు వేడుకలను జరుపుకోనుంది.
అయితే, రెండు దశాబ్దాల వెబ్‌దునియా ప్రయాణంలో ఎన్ని అవాంతరాలు, ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ వార్తల సేకరణలో మాత్రం సాఫీగా సాగిపోతోంది. ఈ పయనంలో ఎందరో సహాయసహకారాలు అందించారు. మరెందరో తమ సేవలు అందించారు. వారందరు అహరహం చేసిన కృషి ఫలితమే నేడు వెబ్‌దునియా జయకేతనం ఎగురవేస్తూ 20వ వసంతంలోకి అడుగుపెట్టనుంది.
'నయీ దునియా' జాతీయ హిందీ దినపత్రిక గోడౌనులో పుట్టిన వెబ్ దునియా నేడు భారతీయ భాషల్లో అగ్రగామిగా ఉంటూ ప్రధాన భూమిక పోషిస్తోంది. ఈ 20 యేళ్ళ సుధీర్ఘ ప్రయాణంలో వెబ్‌దునియాలో ఎన్నో రకాల మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, సోషల్ మీడియా హవా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో వెబ్‌దునియా తెలుగు అటు ఫేస్‌బుక్, ట్వట్టర్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మరింతగా చేరువైంది. ఫేస్‌బుక్‌లో నిరంతరం తాజా సమాచారాన్ని ఎప్పటికపుడు పోస్ట్ చేస్తూ సాగిపోతోంది.
అలాగే, మరో సోషల్ మీడియా దిగ్గజమైన ట్విట్టర్‌లో కూడా వెబ్‌దునియా దూసుకెళుతోంది. ఇతర ఆన్‌లైన్ వార్తా సంస్థల కంటే భిన్నంగా విశ్లేషణాత్మక కథనాలు ఇస్తోంది. ముఖ్యంగా, ట్విట్టర్‌లో ప్రధానంగా ట్రెండ్ అయ్యే అంశాల లోతుల్లోకి వెళ్లి విశ్లేషణాత్మక కథనాలను నెటిజన్లకు అందిస్తోంది. వెబ్‌దునియా వ్యవస్థాపించబడినపుడు అంతర్జాలంతో అనుసంధానమవడం చాలా క్లిష్టతరంగా ఉండేది. అలాంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో ఆ అడ్డంకులన్నిటినీ తొలగించుకుని, వాటిని అధిగమించి ముందుకు సాగింది.
ఈ విజయ పరంపరలో వెబ్‌దునియాతో పయనిస్తున్న, పయనించిన వారందరికీ ధన్యవాదాలు. కృతజ్ఞతలు. అంతేకాదు... వారందరి ఆశీర్వాదాలు మాకు ఎల్లవేళలా ఉంటాయని, వారి దీవెనలు, ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయని ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా వెబ్‌దునియాను ఆదరిస్తూ, దినదిన ప్రవర్థమానమయ్యేందుకు సహకరిస్తున్న మా వీక్షకులకు మరోసారి వినమ్ర నమస్కారం తెలియజేసుకుంటున్నాం.