కోట్లు దాటుతున్న శ్రీవారి అన్నప్రసాదం.. తిరుమలేశా... గోవిందా...

అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న మాటను నిజం చేసి చూపిస్తూంది టిటిడి. శ్రీవారి దర్శనార్ధం నిత్యం వేల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాన్ని అందచేస్తూ ఆకలి తీరుస్తోంది. 33 ఏళ్ల క్రితం రోజుకు కొద్ది మంది భక్తులకు కడుపునింపే ఆశయంతో 5 లక్షల రూపాయల

శనివారం, 8 సెప్టెంబరు 2018 (21:14 IST)
అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న మాటను నిజం చేసి చూపిస్తూంది టిటిడి. శ్రీవారి దర్శనార్ధం నిత్యం వేల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాన్ని అందచేస్తూ ఆకలి తీరుస్తోంది. 33 ఏళ్ల క్రితం రోజుకు కొద్ది మంది భక్తులకు కడుపునింపే ఆశయంతో 5 లక్షల రూపాయల మూలధనంతో ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం నేడు వెయ్యికోట్లకు చేరుకుని లక్షల మందికి కడుపునింపుతోంది. ఈ మంచి పనికి దాతల నుంచి విశేష స్పందన రావడంతో తిరుమల పరిధిని దాటిపోయి అనేక చోట్లకు విస్తరించి అన్నపూర్ణగా మారింది. టీటీడీ అన్నప్రసాద ట్రస్ట్ వెయ్యి కోట్ల మార్కును దాటిని సందర్భంగా ప్రత్యేక కథనం.
 
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుటుంటారు. దేశంలో మరే దేవాలయానికి రాని విధంగా భక్తులు వెంకన్న దర్శనానికి తరలివస్తూంటారు. అలా అలసిసొలసి వచ్చే భక్తుల ఆకలి తీర్చే పవిత్ర ఆశయంతో మొదలైంది తిరుమలలోని అన్నదాన కార్యక్రమం. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ప్రారంభంలో 5 లక్షల విరాలళంతో మొదలైన ఈ కార్యక్రమంగా ప్రస్తుతం వెయ్యి కోట్లకు చేరుకుంది. బ్యాంకులో డిపాజిట్ చేసిన ఆ నిధుల వడ్డీ నుంచి వచ్చే సొమ్ముతో విరామం లేకుండా నిత్యం భక్తుల కడుపు నింపుతోంది. అలాగే డబ్బు రూపంలోనే కాకుండా బియ్యం, కూరగాయలు, వంట సామాగ్రి రూపంలో నిత్యం నలుమూలల నుంచి భక్తులు పంపే సరుకుల సహకారంతో నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం నిర్వహస్తోంది టీటీడీ. నిత్యం భక్తులు హుండీలో వేసే కానుకలే కాకుండా టీటీడీ చేపట్టిన వివిధ ట్రస్టులకు దాతలు విరాళాలు అందచేస్తుంటారు. ఇలా అన్నప్రసాద పథకం, ఆరోగ్యవరప్రసాదం, ప్రాణదాన పథకం, గో సంరక్షణ పథకం, వేద పరిరక్షణ పథకం, బాలమందిరం ట్రస్టు, స్విమ్స్ వంటి  పలు పథకాలును అంచెలంచెలుగా ప్రారంభించింది టిటిడి. వీటిలోఅన్న ప్రసాదం ట్రస్టుకు అత్యంత ప్రాధాన్యత ఉంది.
 
ఇక అన్నదాన పథకం పూర్వాపరాలు పరిశీలిస్తే... మొదట్లో తిరుమలలోని స్థానిక మఠాలు భక్తుల ఆకలిని తీరుస్తూ ఉండేవి. అయితే క్రమంగా పెరుగుతన్న భక్తుల సంఖ్య కారణంగా ఎక్కువమంది ఆహారన్ని కొని తినాల్సి వచ్చేది. దీంతో సామాన్య భక్తుల ఇబ్బందిని పరిగణలోకి తీసుకున్న టీడీడీ నిర్ణయం ప్రకారం 1985 ఏఫ్రిల్ 6వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అన్నప్రసాద పథకాన్ని ప్రారంభించారు. మొట్టమొదట బెంగళూరుకు చెందిన ఎల్వి రామయ్య అనే భక్తుడు 5 లక్షల రూపాయలతో ప్రారంభమైన ఈ పథకానికి మొదటి ఏడాదే 60 లక్షల రూపాయల విరాళాలు అందాయి.
 
అటు తర్వాత అన్నదాన పథకానికి భక్తుల నుంచి విరాళాలు మరింత ఊపందుకున్నాయి. ఏడాదికేడాదీ ప్రవాహంలా అన్నదాన ట్రస్టుకు భక్తులు విరాళాలు అందిస్తూ వస్తుండటంతో ప్రస్తుతం అన్నదానం ట్రస్టు డిపాజిట్లు వెయ్యికోట్ల మార్కును దాటాయి. బాంకులో డిపాజిట్ల రూపంలో ఉన్న ఈ నగదు నుంచి వచ్చే డిపాజిట్ల వడ్డీతో నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది. గతంలో అన్నదాన ట్రస్టు పేరులో దానం అనే పదాన్ని మార్చి అన్నప్రసాద పథకంగా మార్చింది టీటీడీ.
 
భక్తుల నుండి లభిస్తున్న సహకారంతో టిటిడి అన్నప్రసాద పథకాన్ని భారీ ఎత్తున విస్తరిస్తూ వచ్చింది టీటీడీ. మొదట్లో శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు ఆలయంలోనే టోకెన్లు అందజేసి అన్నప్రసాద సౌకర్యం కల్పించే టిటిడి, అటు తరువాత 2007 నుండి టోకెన్లతో సంబంధం లేకుండా ఎవరికైనా తిరుమలలో భోజన సౌకర్యం కల్పించేలా ఏర్పాట్లు చేసింది. దీనితో అప్పటివరకు నిత్యం 25 వేల మంది భక్తులకు కల్పించే భోజన సౌకర్యం అటు తరువాత 50 నుంచి 60 వేలకు చేరుకుంది. ప్రస్తుతం రోజకు లక్షమంది భక్తులకు దర్శనాన్ని టీటీడీ కల్పిస్తుండటంతో నిత్యం దాదాపు తిరుమలలోని ప్రధాన అన్నదాన కేంద్రంలో దాదాపు 50లక్షల మందికి.. ఇతర చోట్ల పది నుంచి పదిహేను లక్షల మందికి అన్నప్రసాదాన్ని అందచేస్తోంది. రోజురోజకు పెరుగుతన్న భక్తులకు గతంలో ఉన్న పాత అన్నదానం భవనం సరిపోకపోవడంతో ఆసియాలోనే అతి పెద్ద అన్నప్రసాద సమూదాయాని 25 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించింది టిటిడి. ఒక్కసారిగా 4 వేల మంది భక్తులు భోజనం చేసేలా, నిత్యం లక్ష మంది భక్తులకు భోజన సౌకర్యం కల్పించేలా ఏర్పాట్లు చేసిన ఈ నూతన భవనాన్ని 2011లో ప్రారంభించింది టిటిడి. అత్యాధునిక భారీ ఆవిరి యంత్రాల ద్వారా ఆహారాన్ని తయారుచేసి వేలాది మందికి సకాలంలో ఆహారాన్ని సిద్దం చేస్తుంటారు సిబ్బంది. 
 
టీటీడీ సిబ్బందితో పాటు శ్రీవారి సేవకులూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటూ మానవసేవే మాధవసేవ అని చాటుతున్నారు. ప్రధాన అన్న ప్రసాద కేంద్రంలోనే కాకుండా ఇతర పలు ప్రదేశాల్లోనూ భక్తులకు ఆహారాన్ని అందచేస్తోంది టీటీడీ. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, యాత్రికులు వసతి సమూదాయలలోనూ అన్నప్రసాదాన్ని అందచేస్తోంది. అలాగే మూడేళ్ల క్రింతం తిరుచానురు పద్మావతి అమ్మవారి ఆలయంలోను అన్నప్రసాదం పధకంను ప్రారంభించిన టిటిడి, అనంతరం తిరుపతిలోని వసతి గృహ సముదాయాలలోను అన్నప్రసాద పధకాని విస్తరించింది. అలాగే  తిరుమలతో పాటూ పలుచోట్ల మొబైల్ ఫుడ్ కౌంటర్ల ద్వారా ఆహారన్ని అందించడం మొదలుపెట్టింది. తిరుమలలోని రద్దీ ప్రదేశాలతోపాటూ కాలినడక మార్గాలలోనూ భక్తులకు అన్నప్రసాదాలు అందచేస్తూ భక్తుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఇలా తిరుమలేశుడు తన భక్తులకు ఆకలి బాధ లేకుండా చేస్తున్నారు. గోవిందా... గోవిందా... గోవిందా... అని కొలుద్దాం ఆ తిరుమల వెంకన్నను.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నాకు ప్రాణహాని... బాబును లోపలేయాలని చూస్తున్నారు... శివాజి చెప్పేది నిజమా?