Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆయనంటే తాలిబన్లకు వెన్నులో వణుకు.. ఎవరా ధీరుడు?

ఆయనంటే తాలిబన్లకు వెన్నులో వణుకు.. ఎవరా ధీరుడు?
, శుక్రవారం, 20 ఆగస్టు 2021 (09:45 IST)
ఆప్ఘనిస్థాన్ దేశాన్ని తాలిబన్ తీవ్రవాదులు ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత సాక్షాత్ ఆ దేశ అధ్యక్షుడుగా అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయాడు. అయితే, దేశాన్నంతటినీ ఆక్రమించామన్న విజయ గర్వంతో ఉప్పొంగిపోతున్న తాలిబన్‌ ఫైటర్లకు ఒక్కడు ఒకే ఒక్కడు కొరకరాని కొయ్యిలా మారాడు. అతను ఉండే ప్రాంతంలో ఎలాగైనా అక్కడ అడుగు పెట్టాలని 20 యేళ్లకు పైగా విశ్వప్రయత్నాలు చేసినా కనీసం టచ్‌ చేయలేదు కాదు కదా కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేకపోయారు. 
 
ఆ ప్రాంతానికి చెందిన ఓ నేత పేరు వింటేనే వారి వెన్నులో వణుకు పుడుతోంది. ఆ ప్రాంతమే ఇప్పుడు ఆప్ఘనిస్తాన్ రాజకీయ వ్యూహాలకు కేంద్ర బిందువుగా మారింది. తాలిబన్ల దురాక్రమణపై సింహంలా గర్జిస్తున్న ప్రాంతం పేరు పంజ్‌షిర్‌. ఆ నాయకుడే ఒకప్పుడు అక్కడ గెరిల్లా పోరాటంలో కీలకంగా వ్యవహరించారు. ఆయన పేరు అహ్మద్‌ షా మసూద్‌‌. అసలు తాలిబన్లకు తలవంచని పంజ్‌షిర్‌ ప్రత్యేకత ఏమిటి? రాక్షసత్వానికి మారుపేరైన తాలిబన్లకు అహ్మద్‌ షా మసూద్‌ అంటే ఎందుకంత భయపడేవారు?
 
ఈ ప్రాంతం హిందూకుష్‌ పర్వత శ్రేణులకు సమీపంలో కాబుల్‌కు ఉత్తరాన 150 కి.మీల దూరంలో పంజ్‌షిర్‌ ప్రావిన్స్‌ ఉంది. కేవలం లక్షకు పైగా జనాభా కలిగిన ఈ ప్రాంతంలో తజిక్‌ జాతికి చెందిన ప్రజలే అత్యధికం. పంజ్‌షిర్‌ అంటే సంస్కృతంలో ఐదు సింహాలు అని అర్థం. ఈ ప్రాంతానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే 11వ శతాబ్దపు చరిత్ర ఆనవాళ్లోకి వెళ్లాల్సిందే. 
 
తాలిబన్లకు సవాళ్లు ఇక్కడి నుంచే..!
ప్రస్తుతం పంజ్‌షిర్‌ ప్రాంతమే రాజకీయ వ్యూహాలకు కేంద్రబిందువుగా మారుతోంది. అఫ్గాన్‌ జాతీయ ప్రతిఘటనకు వేదికగా నిలుస్తోంది. ఈ ప్రాంతానికి చెందిన అహ్మద్‌ షా మసూద్‌ తనయుడు అహ్మద్‌ మసూద్‌, ఇప్పటివరకు అఫ్గన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్న అమ్రుల్లా సలేహ్‌, బిస్మిల్లాఖాన్‌ మొహమ్మది తదితర కీలక నేతలు తాలిబన్ల దురాక్రమణను సవాల్‌ చేస్తున్నారు. ఆ దిశగా వారు సన్నాహాలు జరుపుతుండటం చర్చనీయాంశంగామారింది. 
 
తాలిబన్లు కాబుల్‌ను కైవసం చేసుకున్న మరుక్షణమే ఆ దేశ అధ్యక్షుడిగా ఉన్న అష్రఫ్‌ ఘనీ ప్రాణభయంతో భారీగా డబ్బుతో యూఏఈకి పారిపోయి తలదాచుకోగా.. ఆ దేశ తొలి ఉపాధ్యక్షుడిగా ఉన్న అమ్రుల్లా సలేహ్‌ మాత్రం తాలిబన్లకు తలవంచేది లేదని ధైర్యంగా ప్రకటించారు. 
 
ప్రస్తుతం దేశం లోపలే ఉన్నానని, ఆపద్ధర్మ దేశ అధ్యక్షుడిని కూడా తానేనని ప్రకటించుకున్నారు. మరోవైపు, అహ్మద్‌ మసూద్‌ కూడా తన తండ్రి మార్గంలోనే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. తాలిబన్‌ ఫైటర్లపై పోరాటానికి పశ్చిమ దేశాల మద్దతును కోరుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో మరో రోజు తగ్గిన డీజిల్ ధర