Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైసిపిలో పెదరాయుడు - అక్కడ ఆయన మాటే శాసనం..?

చిత్తూరు జిల్లా వైసిపిలో ఒన్ మ్యాన్ షో నడుస్తోంది. జిల్లా అంతటా ఆయన చెప్పిందే వేదం. పార్టీలో ఎవరిని ఉంచాలన్నా, బయటకు పంపించాలన్నా ఆయనదే నిర్ణయం. ఆయన మాటలకు పార్టీ అధినేత జగన్ కూడా ఊ కొట్టాల్సిందే. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో ఆశావహులంతా ఆయన్ను

వైసిపిలో పెదరాయుడు - అక్కడ ఆయన మాటే శాసనం..?
, బుధవారం, 4 జులై 2018 (20:45 IST)
చిత్తూరు జిల్లా వైసిపిలో ఒన్ మ్యాన్ షో నడుస్తోంది. జిల్లా అంతటా ఆయన చెప్పిందే వేదం. పార్టీలో ఎవరిని ఉంచాలన్నా, బయటకు పంపించాలన్నా ఆయనదే నిర్ణయం. ఆయన మాటలకు పార్టీ అధినేత జగన్ కూడా ఊ కొట్టాల్సిందే. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో ఆశావహులంతా ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. సిఎం చంద్రబాబు సొంత జిల్లాలో వైసిపిని శాసిస్తున్న ఆ నేత ఎవరు..? 
 
చిత్తూరు జిల్లాలో అధికార టిడిపితో వైసిపి ఢీ అంటే ఢీ అంటోంది. 2014 ఎన్నికల్లో 8చోట్ల వైసిపి అభ్యర్థులు గెలుపొందగా ఆరు చోట్లకే టిడిపి పరిమితమైంది. వైసిపి బలమైన నేతలే చిత్తూరు జిల్లాలో ఉన్నారు. రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డితో పాటు వైసిపిలో మరో కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. పుంగనూరు నియోజకవర్గం నుంచి పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వైసిపికి పెద్ద దిక్కు లాంటి వారు పెద్దిరెడ్డి. పార్టీకి సంబంధించి ఏ నిర్ణయమైనా జిల్లాలో ఆయనే తీసుకుంటారు. 
 
చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో దాదాపు 10 నియోజకవర్గాల్లో పార్టీని ఆయనే శాసిస్తున్నారు. పడమటి నియోజకవర్గంలో పెద్దిరెడ్డికి పట్టుంది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పుంగనూరుతో పాటు పలమనేరు, తంబళ్లపల్లి, మదనపల్లి, పూతలపట్టు, జి.డి.నెల్లూరు. కుప్పం, సత్యవేడు, చిత్తూరు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. తిరుపతి, చంద్రగిరి, నగరి నియోజకవర్గాల్లో మాత్రం పెద్దిరెడ్డి అంటీముట్టనట్లు ఉంటారు. ఈ మూడు స్థానాల్లో మినహా మిగిలిన వాటిలో పెద్దిరెడ్డి మాట పెదరాయుడి తీర్పు అన్న మాట. 
 
ఎవరి మాట వినడన్న జగన్ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి మాటను మాత్రం వింటాడన్న పేరుంది. జిల్లాలో పార్టీ మొత్తాన్ని జగన్ పెద్దిరెడ్డి చేతిలో ఎలా పెట్టారన్న అనుమానం రాకమానదు. ఇందుకూ కారణాలు లేకపోలేదు. పెద్దిరెడ్డికి ఆర్థికంగా అంగబలం జిల్లా అంతటా ఉంది. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగి మంత్రిగా కూడా పనిచేసిన పెద్దిరెడ్డి ఒక బడా కాంట్రాక్టర్.. జాతీయ రహదారుల కాంట్రాక్టులతో పాటు అనేక ప్రాజెక్టుల నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. రాజకీయంగా పలుకుబడి కలిగిన కుటుంబం కావడంతో పాటు జిల్లా అంతటా ఆయనకు అనుచరగణం ఉంది. అన్నింటికీ మించి వేలకోట్ల రూపాయల సామ్రాజ్యం ఉన్నా ఇప్పటికీ సామాన్య నాయకుడిలా ప్రతి కార్యకర్తను సౌమ్యంగా పలుకరించడం పెద్దిరెడ్డికి అలవాటు. ఈ తత్వమే పెద్దిరెడ్డికి బలమైన బలాన్ని చేకూర్చింది. 
 
ఇదంతా ఒక ఎత్తయితే చంద్రబాబుతో దశాబ్దాల వైరం పెద్దిరెడ్డిని జగన్‌కు మరింత దగ్గర చేసింది. జిల్లాలో చంద్రబాబుతో ఢీ అంటే ఢీ అనేలా పెద్దిరెడ్డి తొలి నుంచి వ్యవహరిస్తున్నారు. కాలేజీ రోజుల నుంచే చంద్రబాబు, పెద్దిరెడ్డిల మధ్య వైరం ఉంది. ఈ కారణాలతోనే పెద్దిరెడ్డి ఏం చేసినా జగన్ అడ్డుచెప్పరన్న వాదన వినిపిస్తోంది. పెద్దిరెడ్డి ఆశీస్సులు ఉంటే గానీ వైసిపిలో తమకు టిక్కెట్టు దక్కదని వైసిపి నాయకులకు బాగా తెలుసు. జిల్లాలో మెజారిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం పెద్దిరెడ్డి ద్వారానే గతంలో టిక్కెట్టు తెచ్చుకున్నారు. మళ్ళీ టిక్కెట్టు కోసం వారంతా పెద్దిరెడ్డి ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 
 
జిల్లాలో మెజారిటీ స్థానాలు దక్కాలంటే పెద్దిరెడ్డి సహకారం అవసరమని జగన్ భావిస్తున్నారు. ఈ కారణంగానే పెద్దిరెడ్డికి పార్టీలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. మరి జగన్ తనపై పెట్టిన నమ్మకాన్ని పెద్దిరెడ్డి ఈ ఎన్నికల్లో కూడా కాపాడుకుని ఎక్కువ అసెంబ్లీ సీట్లు వచ్చేలా ప్రయత్నిస్తాడో లేదో వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సవతి తల్లి గదిలోకి వెళ్లి.. లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడు.. ఎక్కడ?