Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లోక్‌సభ ఎన్నికలపై భారస కసరత్తు : మెదక్ బరిలో మాజీ సీఎం కేసీఆర్

kcrao
, మంగళవారం, 26 డిశెంబరు 2023 (06:55 IST)
వచ్చే యేడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం భారత రాష్ట్ర సమితి ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. గతంలో జరిగిన ఎన్నికల్లో తొమ్మిది సీట్లలో బీఆర్ఎస్ గెలుపొందింది. అయితే, గతంలో అధికారంలో ఉన్నపుడే కేవలం 9 సీట్లకే పరిమితమైంది. కానీ, ఇపుడు అధికారంలో లేదు. దీంతో గెలుపు ఆశలు ఆ పార్టీ నేతల్లో సన్నగిల్లాయి. మరోవైపు, గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత కేసీఆర్ మెదక్ బరిలో పోటీ చేయాలని భావిస్తున్నారు. అలాగే, ఇతర రాష్ట్రాల్లో కూడా పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. 
 
కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలుకావడంతో వచ్చే లోక్‌సభ ఎన్నికలు ఆ పార్టీకి సవాల్‌గా పరిణమించాయి. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 'సారు.. కారు.. పదహారు' నినాదంతో జనంలోకి వెళ్లిన ఆ పార్టీ 9 ఎంపీ స్థానాలకే పరిమితమైంది. జహీరాబాద్‌, వరంగల్‌, చేవెళ్ల, మహబూబాబాద్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, నాగర్‌కర్నూల్‌, పెద్దపల్లి స్థానాలను దక్కించుకుంది.
 
నాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే 9 స్థానాలు లభిస్తే, ఈసారి అధికారం కోల్పోయిన పరిస్థితుల్లో, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రజలను ఆకట్టుకునేలా కొత్త కొత్త హామీల అమలుతో దూసుకుపోతున్న తరుణంలో ఎన్ని స్థానాలు లభిస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై బీఆర్‌ఎస్‌ వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో కాంగ్రెస్‌ స్వీప్‌ చేసింది. పలు ఇతర జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ ఒకటి రెండు ఎమ్మెల్యే స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 
 
ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని గెలుపు తీరాలకు చేర్చటం పార్టీ అధినేత కేసీఆర్‌కు గట్టి సవాలేనన్న అభిప్రాయాలు బీఆర్‌ఎస్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో జనం మూడ్‌ ఎలా ఉన్నా.. ఎంపీ ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని గులాబీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. గతంలో దక్కించుకున్న తొమ్మిదింటిని కాపాడుకోవడంతోపాటు మరిన్ని స్థానాలను గెల్చుకోవాలని బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. 
 
ఎంఐఎంతో ఉన్న స్నేహసంబంధాల దృష్ట్యా మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో.. హైదరాబాద్‌ను మినహాయించి, మిగిలిన 16 సీట్లపై ఫోకస్‌ పెట్టబోతున్నట్లు బీఆర్‌ఎస్‌ శ్రేణులు చెబుతున్నాయి. ఆయా స్థానాల్లో సిటింగ్‌లను, గతంలో ఓటమి పాలైన వారిని తిరిగి బరిలో దించుతారా? కొత్త వారికి అవకాశం ఇస్తారా? అన్నదానిపై పార్టీ అధినేత నిర్ణయం తీసుకోనున్నారని పేర్కొంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను మార్చకపోవడం వల్లే ఎదురుదెబ్బ తగిలిందన్న విశ్లేషణల నేపథ్యంలో, ఎంపీ అభ్యర్థులను మారుస్తారా? కొత్తవాళ్లకి ఛాన్స్‌ ఇస్తే.. ఎవరికి ఇస్తారన్న దానిపై పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. 
 
దీంతో మళ్లీ టికెట్‌ రాదేమోనన్న ఆందోళనతో కొందరు సిటింగ్‌ ఎంపీలు ఉండగా.. అసెంబ్లీ బరిలో ఓటమి పాలైన కొందరు లోక్‌సభ బరిలో నిలిచేందుకు ఉత్సాహపడుతున్నారు. కొన్ని స్థానాల్లోనైనా కొత్త వారికి చాన్స్‌ దక్కనుందనే ప్రచారం జరుగుతోంది. పార్టీ అధినేత కేసీఆర్‌ కూడా మెదక్‌ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అదే జరిగితే ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో కొత్తగా జవసత్వాలు నింపినట్లవుతుందని భావిస్తున్నారు.
 
అదేసమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లే ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూడా గట్టి పోటీ ఇవ్వనుంది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ ఉండనుంది. దీనిని తట్టుకొని పార్టీని విజయతీరాల వైపు తీసుకెళ్లటానికి కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. టీఆర్‌ఎస్‌గా ఉన్న పార్టీ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చాక జరుగుతున్న తొలి లోక్‌సభ ఎన్నికలు ఇవి. ఈ నేపథ్యంలో, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోనూ బీఆర్‌ఎస్‌ తరఫున అభ్యర్థులను బరిలో నిలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో జేఎన్.1 సబ్ వేరియంట్‌ను గుర్తించారా? ఆయన ఏమన్నారు?