Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇన్‌కంటాక్స్ రద్దు చేస్తే మోదీ వెంట మధ్య తరగతి ప్రజలు వెళ్తారా?

పెద్ద నోట్లు రద్దు చేయడం ద్వారా, నల్లధనాన్ని అరికట్టి, ఒకొక్కరి అకౌంట్‌లో రూ.15 లక్షలు వేస్తానని ఆర్భాటంగా ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ… పెద్ద నోట్లయితే రద్దు చేశారుగానీ… పేదల అకౌంట్‌లో రూపాయి జమ చేయలేకపోయారు. పెద్దనోట్ల రద్దుతో మోడీ అభాసుపా

ఇన్‌కంటాక్స్ రద్దు చేస్తే మోదీ వెంట మధ్య తరగతి ప్రజలు వెళ్తారా?
, బుధవారం, 11 జులై 2018 (13:22 IST)
పెద్ద నోట్లు రద్దు చేయడం ద్వారా, నల్లధనాన్ని అరికట్టి, ఒకొక్కరి అకౌంట్‌లో రూ.15 లక్షలు వేస్తానని ఆర్భాటంగా ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ… పెద్ద నోట్లయితే రద్దు చేశారుగానీ… పేదల అకౌంట్‌లో రూపాయి జమ చేయలేకపోయారు. పెద్దనోట్ల రద్దుతో మోడీ అభాసుపాలయ్యారు. ఆ తరువాత జిఎస్‌టి తీసుకొచ్చారు. ఇది మరింత మంట పుట్టించింది. ఈ రెండు నిర్ణయాలు… బిజెపిని నెత్తిన మోసిన మధ్య తరగతికి కొరకరాని కొయ్యలు అయ్యాయి. ఏ ఉద్యోగులు, వ్యాపారవర్గాలైతే బిజెపిని ఆకాశానికెత్తేయో…. ఆ వర్గాలే ఇప్పుడు భగ్గుమంటున్నాయి. 
 
మోడీ పైన ఈగ వాలనీకుండా చూసింది కూడా ఈ ప్రజలే. అలాంటివారే దూరమైనపుడు వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎలా.. అనే ఆందోళన జెపిపి నేతల్లో మొదలయింది. 2019 ఎన్నికలను గట్టెక్కేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఆ వ్యూహంలో భాగంగానే ఇన్‌కం టాక్స్‌ - ఆదాయపన్నును పూర్తిగా రద్దు చేయాలన్న ఆలోచనలో మోడీ ఉన్నారని వార్తలొస్తున్నాయి.
 
దేశంలో 120 కోట్ల మంది జనాభా ఉన్నప్పటికీ, అధిక ఆదాయ వర్గాలు ఉన్నప్పటికీ… వాళ్లంతా తెలివిగా ఆదాయపన్ను ఎగ్గొడుతున్నారు. వేతన జీవులు మాత్రమే రికార్డెడ్‌గా దొరికిపోతారు కాబట్టి…. అనివార్యంగా ఇన్‌కం టాక్స్‌ చెల్లిస్తున్నారు. 
 
ఇటీవల కాలంలో ఉద్యోగుల జీతభత్యాలు పెరిగిన మాట వాస్తవం. టీచర్లు కూడా ఏటా వేలాది రూపాయల ఆదాయపన్ను చెల్లించాల్సిన పరిస్థితి. ఎన్ని దొంగ మార్గాలు అన్వేషించినా… ఎంతోకొంత పన్ను కట్టక తప్పడం లేదు. ఈ మధ్య జిఎస్‌టి వచ్చిన తరువాత…. ప్రతిదానికీ పన్ను కడుతున్నారు. హోటల్‌లో తిన్నా, బాత్‌రూమ్‌కు వెళ్లినా… జిఎస్‌టి చెల్లించక తప్పడం లేదు. ఒకపక్క ఇన్‌కం టాక్స్‌ కట్టించుకుంటూ… ఇంకోపక్క జిఎస్‌టి ఏమిటన్న ప్రశ్న ఉద్యోగ వర్గాల నుంచి వస్తోంది. అందుకే ఆదాయ పన్ను రద్దు చేస్తే మధ్య తరగతి ప్రజల మద్దతు లభిస్తుందన్న అంచనాలో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది. ఆదాయపన్ను రూపంలో భారత ప్రభుత్వానికి ఏటా రూ.4 లక్షల కోట్లు వస్తోంది. జిఎస్‌టిని పక్కాగా వసూలు చేస్తే ఈ లోటును అక్కడ పూడ్చుకోవడం పెద్ద సమస్య కాబోదు.
 
ఆదాయ పన్ను రద్దు చేస్తారని గత బడ్జెట్‌ సమయంలోనూ చర్చ జరిగింది. బిజెపి ఎంపి సుబ్రమణ్యస్వామి ఈ అంశాన్ని ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఆదాయ పన్ను రద్దు చేస్తే…. పొదుపు పెరుగుతుందని చెబుతున్నారు. పన్నులకు భయపడే జనం డబ్బులను బ్యాంకుల్లో పెట్టకుండా ఇంట్లో దాచుకుంటున్నారని, ఇది ఆర్థిక వ్యవస్థకు నష్టమనేది ఆయన వాదన. ఆదాయ పన్ను రద్దు చేయడం ద్వారా బ్యాంకుల్లో పొదుపు పెరుగుతుందని, ఈ డబ్బులు దేశాభివృద్ధికి ఉపయోగపడుతాయని వాదిస్తున్నారు. తను ప్రభుత్వంలో ఉంటే మూడు నిమిషాల్లో ఆదాయ పన్ను రద్దు చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు.
 
ఇదిలావుండగా…. వచ్చే ఆగస్టు 15న ప్రధాన మంత్రి కీలక ప్రకటన చేస్తారని, అది దేశాన్ని మొత్తం ప్రభావితం చేస్తుందని బిజెపి నాయకులు చెబుతున్నారు. ఆ ప్రకటన ఏమిటనేది మాత్రం చెప్పడం లేదు. అది ఆదాయ పన్ను రద్దు నిర్ణయమేనని అందరూ అంచనా వేస్తున్నారు. ఓట్ల కోసమైనా ఆదాయ పన్ను నుంచి వేతన జీవులను, మధ్యతరగతిని ఆదాయ పన్ను భారం నుంచి తప్పించడం ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే… ఇది నోట్ల రద్దులా ఒక అమగ్యగోచర కార్యక్రమంలా మిగిలిపోకూడదు. ఏదేమైనప్పటికీ ఆదాయపన్ను రద్దు చేస్తే మాత్రం మధ్యతరగతి ప్రజలు దాదాపు మోదీ వెంట నడవడం ఖాయమనే చెప్పుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆదాయపన్ను రద్దు : ఇదే మోడీ పంద్రాగస్టు దినోత్సవ కానుక?