Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజయకాంత్ ప్రాణాలు తీసిన కరోనా వైరస్...

Advertiesment
vijayakanth
, గురువారం, 28 డిశెంబరు 2023 (09:34 IST)
తమిళ చిత్రపరిశ్రమకు చెందిన అగ్ర నటుడు, డీఎండీకే అధ్యక్షుడు కెప్టెన్ విజయకాంత్ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ వచ్చిన ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బుధవారం అనారోగ్యానికి గురికావడంతో చెన్నై మియాట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. తమిళ చిత్రపరిశ్రమలో కెప్టెన్‌గా గుర్తింపు పొందిన విజయకాంత్... మృతిపట్ల ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. విజయకాంత్ గతంలో మధుమేహం ఇతరత్రా సమస్యలతోనూ బాధపడ్డారు.
 
కెప్టెన్ కుటుంబ నేపథ్యం...
విజయకాంత్ 1952 ఆగస్టు 25న తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అశగర్ స్వామి. చిత్ర పరిశ్రమలోకి వెళ్లిన తర్వాత విజయకాంత్‌గా పేరు మార్చుకున్నారు. తల్లిదండ్రులు కె.ఎన్. అళగర్ స్వామి, ఆండాళ్ అజగర్ స్వామి. విజయకాంత్‌కు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరైన షణ్ముఖ పాండియన్ హీరోగా ఉన్నారు. 
 
సినీ జీవితం.. 
27 ఏళ్ల వయసులో విజయకాంత్ తెరంగేట్రం చేశారు. ఆయన నటించిన తొలి సినిమా 'ఇనిక్కుమ్ ఇలమై'. 1979లో వచ్చింది. ప్రతినాయకుడి పాత్రతోనే ఆయన ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి 2015 వరకు నిర్విరామంగా నటించారు. 3 షిఫ్టుల్లో పనిచేసేవారు. కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయకాంత్.. ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన 'దూరతు ఇడి ముళక్కం', 'సత్తం ఓరు ఇరుత్తరై'లతో విజయాలు అందుకున్నారు. ఆయన నటించిన సినిమాల సంఖ్య 150కి పైగానే. 1984లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదలవడం విశేషం. 
 
పోలీసు అధికారిగా 20కిపైగా కనిపించారు. ఆయన నటించిన ఆఖరి సినిమా 'సగప్తం' (2015). విజయకాంత్ తన సినిమాల్లో ఏదో ఒక సందేశం ఉండేలా చూసుకునేవారు. దేశభక్తి సినిమాలైనా, గ్రామీణ నేపథ్య చిత్రాలైనా, ద్విపాత్రాభినయం చేయాలన్నా విజయకాంత్ అందరికంటే ముందుండేవారు. మరోవైపు కమర్షియల్ చిత్రాల్లోనూ సందడి చేసేవారు. ఇతరుల్లాకాకుండా ఆయన పారితోషికాన్ని ముందుగానే తీసుకునేవారుకారు. తనతో సినిమా నిర్మించే నిర్మాతలు ఆర్థిక సమస్యల్లో ఉన్నారని తెలిస్తే వారి నుంచి రెమ్యునరేషన్ తీసుకునేవారు కారు. 
 
విప్లవాత్మక నటుడు..
తన కెరీర్‌లో విజయకాంత్ కేవలం తమిళ చిత్రాలే తప్ప ఇతర భాషల్లో నటించలేదు. కానీ, ఆయన సినిమాలు తెలుగు, హిందీ డబ్ అయి అక్కడా మంచి విజయాలు సాధించాయి. 'శివప్పు మల్లి' (ఎర్ర మల్లెలు రీమేక్), 'జదిక్కొరు నీధి' తదితర చైతన్యవంతమైన సినిమాల్లో నటించడంతో కోలీవుడ్‌లో ముందుగా ఆయన్ను 'పురట్చి కలైంజ్ఞర్'గా పిలిచేవారు. ఆ తర్వాత అభిమానులంతా 'కెప్టెన్ విజయకాంత్‌గా పిలుచుకోవడం మొదలుపెట్టారు. ఆయన వందో చిత్రం 'కెప్టెన్ ప్రభాకరన్' బాక్సాఫీసు వద్ద బ్లాక్బస్టర్ హిట్‌గా నిలవడమే
అందుకు కారణం.
 
ఇతర స్టార్ నటులతో కలిసి..
కోలీవుడ్‌లో తెరకెక్కిన తొలి 3డీ చిత్రం విజయకాంత్ నటించిన 'అన్నై భూమి'. ఇందులో ఆయన రాధారవి, కన్నడ నటుడు టైగర్ ప్రభాకర్‌తో కలిసి నటించారు. 'ఈట్టి'లో కన్నడ నటుడు విష్ణువర్ధన్ , 'మనకనక్కు'లో' కోలీవుడ్ నటుడు కమల్ హాసన్‌తో, 'వీరపాండియన్'లో తమిళ నటుడు శివాజీ గణేశన్‌తో కలిసి తెరను పంచుకున్నారు. ఒకానొక సమయంలో రజినీకాంత్, కమల్ హాసన్లకు విజయకాంత్ గట్టి పోటీనిచ్చారు. 
 
నిర్మాత, దర్శకుడిగా.. విజయకాంత్ దర్శకత్వం వహించిన ఒకే ఒక చిత్రం 'విరుధగిరి'. అందులో ఆయనే హీరో. తన బావ ఎల్.కె.సుధీశ్‌తో కలిసి 'వల్లారసు', 'నరసింహ', 'సగాబ్దం' తదితర చిత్రాలను నిర్మించారు. 1994లో 'తమిళనాడు స్టేట్ ఫిల్మ్ ఆనరరీ అవార్డు' (ఎంజీఆర్ పురస్కారం), 2001లో 'కలైమళి అవార్డు' (తమిళనాడు ప్రభుత్వం) అందుకున్నారు. 2001లో 'బెస్ట్ ఇండియన్ సిటిజెన్ అవార్డు', 2009లో 'టాప్ 10 లెజెండ్స్ ఆఫ్ తమిళ్ సినిమా అవార్డు', 2011లో 'ఆనరరీ డాక్టరేట్' (ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చర్చ్ మేనేజ్మెంట్) పొందారు. పలు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందుకున్నారు.
 
అలా రాజకీయాల్లోకి..
ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు. 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2016 ఎన్నికల్లో పరాజయం పొందారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళ సీనియర్ హీరో విజయకాంత్ ఇకలేరు..