రెండు నెలల క్రితం వివాహమైన ఓ నవ వధువు... తన భర్తను చంపేందుకు హత్య చేయాలని నిర్ణయించింది. సెల్ఫీ దిగుదామని నమ్మించి భర్తను నదిలో తోసేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
కర్ణాటక, మహారాష్ట్రలో భారీగా కురిసిన వర్షాలకు నిండుకుండలా మారిన కృష్ణానది దారిలో చూడ ముచ్చటగా కనిపించింది. దీంతో అక్కడ సెల్ఫీ దిగుదామని భర్తను భార్య కోరింది. కాదనలేక బ్రిడ్జిపై బైక్ నిలిపిన భర్త.. భార్యతో ఫొటో దిగేందుకు పక్కన చేరాడు. సెల్ఫీ క్లిక్ మని అన్నదో లేదో.. అనూహ్యంగా బ్రిడ్జిపై నుంచి భర్తను నదిలో తోసేసింది భార్య.
సెల్ఫీ పేర భార్య చేసిన ఈ అఘాయిత్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటకలోని దేవసూగూరు గ్రామానికి చెందిన తాతయ్య తన భార్య సుమంగళతో కలిసి ద్విచక్ర వాహనంపై భార్య స్వగ్రామం లింగసూగూరు నుంచి శనివారం ఉదయం దేవసూగూరు గ్రామానికి బయలుదేరాడు.
నారాయణపేట జిల్లా సరిహద్దు కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా కడలూరు గ్రామ శివారులోని కృష్ణానదిపై ఉన్న గుర్జాపూర్ రోడ్ కం బ్యారేజ్ వద్దకు రాగానే సెల్ఫీ దిగుదామని సుమంగళ కోరింది. దీంతో బైకుపై పక్కన నిలిపి సెల్ఫీ దిగుతుండగా భర్త తాతయ్య, సుమంగళ నదిలోకి తోసింది. ఉదృతంగా పారుతున్న నీటిలో కొట్టుకుపోయిన తాతయ్యకు అదృష్టవశాత్తు నదిలో పెద్ద బండరాళ్లు కనిపించాయి.
దీంతో అతను అటువైపు ఈదుతూ వెళ్లి ఆ రాళ్లపై నిల బడి సహాయం కోసం కేకలు వేశాడు. దీంతో బ్రిడ్జిపై వెళుతున్న యువకులు అతన్ని గమనించారు. సుమారు 100 మీటర్ల దూరంలో నది మధ్యలో రాళ్లపై ఉన్న తాతయ్యకు అందేలా బ్రిడ్జిపై నుంచి తాడు వేశారు. ఆ తాడును అతను నడుముకు కట్టుకోగా.. యువకులు బ్రిడ్జి పైకి లాగి ప్రాణాలు రక్షించారు.