మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలో ఒక వ్యక్తి ఆడ చిరుత జ్వాల, దాని పిల్లలతో సెల్ఫీ, వీడియో తీసుకుంటూ కనిపించాడు. ఈ సెల్ఫీ, వీడియో సోషల్ మీడియాలో (ఫేస్‌బుక్) వైరల్ అయిన తర్వాత ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. షియోపూర్ జిల్లాలోని విజయ్‌పూర్‌లోని గర్హి గ్రామంలో ఈ వీడియో తీయబడింది.
వ్యవసాయ పొలం మధ్యలో ఆడ చిరుతలు వున్నప్పుడు, ఓ యువకుడు భయం లేకుండా అడవి జంతువు వద్దకు వెళ్లాడు. అతను ఒక వీడియోను తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.
ఈ వీడియోలో, ఆ వ్యక్తి చిరుతకు దగ్గరగా కూర్చుని, తన ప్రాణాలను లెక్కచేయకుండా ఫోటో దిగాడు.
అటవీ శాఖ అధికారులు గ్రామస్తులను అడవి జంతువుల నుండి సురక్షితమైన దూరం పాటించాలని పదేపదే హెచ్చరించారు. ఏదైనా వన్యప్రాణులను చూసిన వెంటనే వారికి తెలియజేయాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో చిరుతతో సెల్ఫీ తీసుకున్న వ్యక్తి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.